వాషింగ్టన్ : అతి త్వరలో మానవుల కన్నా తెలివైన వాటిని అభివృద్ధి చేసే కీలక దశలో మనం ఉన్నామని కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ చెప్పారు. వాటితో మనం ప్రశాంతంగా సహజీవనం చేయగలమా? అనే అంశంపై పరిశోధన చేయడం లేదన్నారు. ఆ పరిశోధన చేయవలసిన అవసరం చాలా ఉందని స్పష్టం చేశారు. ఈ దశలో మానవుడు చేసే అతి పెద్ద తప్పు ఈ పరిశోధన చేయడంలో విఫలమవడమేనని తెలిపారు. మనల్ని పట్టించుకోని విధంగా వాటిని మనం సృష్టిస్తే, అవి బహుశా మనల్ని తుడిచిపెట్టేయవచ్చునని చెప్పారు. బీబీసీ న్యూస్నైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ఏఐని అభివృద్ధి చేయడం కోసం తాను తన జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు.
అది ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారడం తనకు చాలా విచారకరమని చెప్పారు. కానీ జనం ఆ ప్రమాదాలను తగినంత శ్రద్ధ, తీవ్రతలతో పట్టించుకోవడం లేదన్నారు. మానవుల కన్నా తెలివైన యంత్రాలను తయారు చేయడానికి పరిశోధకులు అత్యంత సమీపంలో ఉన్నారని పేర్కొన్నారు. ఏఐ రానున్న 20 ఏండ్లలో మానవ మేధాశక్తిని అధిగమిస్తుందని, చాలా రంగాల్లో అది ఇప్పటికే ఆ స్థితికి చేరిందని పరిశోధకులు చెప్తున్నారన్నారు. అదే జరిగితే, అలాంటి సిస్టమ్స్‌ను నియంత్రించడం ఊహించినదాని కన్నా చాలా కష్టమన్నారు.