న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్లు వార్తలు రాగా ఆమె అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరలేద ని మరో గ్రూపు నిరసనకారులు గురువారం వెల్లడించారు. నేపాల్ విద్యుత్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కుల్మన్ ఘీషింగ్ పేరును తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వారు ప్రతిపాదించారు.
జెన్ జెడ్ గ్రూపు ప్రతినిధులు గురువారం నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ని భద్రకాళిలోని సైనిక ప్రధాన కార్యాలయంలో కలుసుకుని తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు ఆర్మీకి చెందిన అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించి దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలపై ప్రధానంగా చర్చలు సాగుతున్నట్లు ఆయన చెప్పారు.
తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టవలసిందిగా సుశీలా కర్కీని అధ్యక్షుడు కాని జెన్ జెడ్ నిరసనకారులు కాని ఆహ్వానించలేదని కర్కీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు రాజ్యాంగం అంగీకరించదని నిరసనకారులలో ఓ వర్గం వాదిస్తోంది. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. మరో ప్రముఖ అభ్యర్థి, కాఠ్మాండు మేయర్ బలేంద్ర షా కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై ఆసక్తి చూపించలేదు. తాత్కాలిక ప్రభుత్వ సారథ్యానికి బలేంద్ర షాను మించిన అర్హతలు ఎవరికీ లేవని, కాని ఆయన అందుకు ఇష్టపడడం లేదని జెన్ జెడ్ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది.
నేపాల్‌లో విద్యుత్తు కొరత సంక్షోభాన్ని పరిష్కరించిన సమర్థుడిగా 54 ఏళ్ల ఘీషింగ్కి ప్రజలలో మంచి పేరు ఉంది. అనేక దశాబ్దాలపాటు నేపాల్‌లో రోజుకు 18 గంటలకు పైగా విద్యుత్తు కోతలు ఉండేవి. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్లోగల రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తి స్కాలర్‌షిప్‌తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన ఘీషింగ్ పట్ల నిరసనకారులలో సానుకూల వైఖరి వ్యక్తమవుతోంది. అయితే తాజా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన గ్రూపులలో ఒకటైన వీ నేపాలీ గ్రూపు అధ్యక్షుడు సుదన్ గురుంగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుశీల కర్కీ నాయకత్వాన్ని స్వీకరించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్‌ని రద్దు చేయడం తమ ప్రధాన డిమాండ్లలో ఒకటని, ఆ తర్వాతే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కొత్త క్యాబినెట్ పనితీరును జెన్ జెడ్ పర్యవేక్షిస్తోందని ఆయన అన్నారు.