France PM | ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్ నూతన ప్రధాని (France PM) సెబాస్టియన్ లెకోర్నూ (Sebastien Lecornu) తాజాగా రాజీనామా చేశారు. పదవి చేపట్టిన నెల రోజుల్లోనే అధికారం నుంచి ఆయన దిగిపోయారు (Sebastien Lecornu resigns). గత నెల జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఓడిపోవడంతో.. సెబాస్టియన్‌ను తదుపరి ప్రధానిగా అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ (Emmanuel Macron) నియమించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత సెబాస్టియన్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాజకీయ పార్టీలతో వారాల తరబడి సంప్రదింపులు జరిపిన అనంతరం ఆదివారం తన మంత్రివర్గాన్ని కూడా నియమించారు. నేడు మంత్రివర్గం తొలి సమావేశం కూడా నిర్వహించనుంది. మంత్రివర్గాన్ని నియమించిన గంటల వ్యవధిలోనే ప్రధాని సెబాస్టియన్ రాజీనామా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయన రాజీనామాను అధ్యక్షుడు మాక్రన్ ఆమోదించినట్లు తెలుస్తోంది.
కాగా, గత రెండేళ్లలో ఫ్రాన్స్‌లో రెండుసార్లు తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రధాని విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రధాని నియామకం మాక్రన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఆయన వద్ద రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్త ప్రధానిని నియమించడం లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే. గత రెండేళ్ల నుంచి ఇదే సమస్య వస్తున్నా.. ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం దేశాధ్యక్షుడు మొగ్గు చూపలేదు. ఒకవేళ ఈసారి ఎన్నికలకు వెళ్తే, ప్రభుత్వాన్ని రద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధాని వ్యక్తిని అధ్యక్షుడు నియమిస్తారు.
Also Read..
Donald Trump | అలా చేయకపోతే భారీ రక్తపాతమే.. ఇజ్రాయెల్, హమాస్‌కు ట్రంప్ కీలక హెచ్చరికలు
Indian Origin | అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య
Mount Everest | మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది ట్రెక్కర్స్