భారత్‌కు చెందిన పలువురు నౌకాదళ రిటైర్డ్ అధికారులను ఖతార్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎందుకు నిర్బంధించారనే దానికి కారణాలు తెలియరాలేదు. వీరిని అక్రమంగా నిర్బంధించారని మితు భార్గవ అనే మహిళ ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించింది. వీరిలో ఒకరు రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.
ఖతార్‌లోని దోహాలో ఎనిమిది మంది రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని అదుపులోకి తీసుకున్న కారణం మాత్రం అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు. ఖతార్ ఎమిరీ నేవీకి శిక్షణ, ఇతర సేవలను అందించే కంపెనీలో ఈ రిటైర్డ్ అధికారులు పనిచేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
వీరి నిర్బంధం విషయం దోహాలోని భారత రాయబార కార్యాలయానికి తెలుసునని, వీరిని అదుపులోకి తీసుకుని ఇవాల్టికి 57 రోజులు అవుతుందని డాక్టర్ మీతూ భార్గవ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం, మాజీ నౌకాదళ అధికారులు దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో పనిచేసేవారు. ఈ కంపెనీ ఖతార్ డిఫెన్స్, ఇతర భద్రతా ఏజెన్సీలకు స్థానిక వ్యాపార భాగస్వామిగా ఉన్నది. రక్షణ పరికరాల నిర్వహణ చూస్తున్నది. ఈ కంపెనీ సీఈవో ఖమీస్ అల్ అజ్మిక్ రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్‌గా రిటైరయ్యారు. అయితే, ఈ రిటైర్డ్ అధికారులను ఎందుకు నిర్బంధంలోకి తీసుకున్నారనే విషయం ఇంతవరకు ఈ కంపెనీ వెల్లడించలేదు.