Gaza | గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) రెండేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజా (Gaza)లో తీవ్ర దుర్భిక్ష (Gaza Starvation) పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆకలి కేకలు రోజురోజుకూ మిన్నంటుతున్నాయి. సంపూర్ణంగా గాజా మొత్తం కరవు పరిస్థితి ఏర్పడింది. ఆహారం దొరక్క గాజా వాసులు ఆకలితో అల్లాడిపోతున్నారు. కొన్ని దేశాలు గాజాపై ఆహారం జార విడుస్తున్నా అది అందరికీ అంగట్లేదు. చాలా మంది ఆకలికి అలమటిస్తున్నారు. దీంతో కుటుంబం కడుపు నింపేందుకు మహిళలు తమ శరీరాలను తాకట్టుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఓ వైపు బాంబుల మోత.. మరోవైపు ఆకలి కేలకలు.. గాజాలో మరో చీకటి కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. యుద్ధం మాటున ఎన్నో ఆకృత్యాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు దర్జాగా బతికిన కుటుంబాలు సైతం ఆహారం కోసం రోడ్డుపై ఆర్తనాదాలు చేస్తున్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితితోపాటూ పలు స్వచ్ఛంద సంస్థలు గాజాలో మానవతా సాయం అందిస్తున్నాయి. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ పౌరులకు ఆహారం, దుస్తులు, మెడిసిన్స్ సరఫరా చేస్తున్నాయి. అయితే, మానవతా సాయం చేసేందుకు వచ్చిన కొందరు వేధింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
యుద్ధం మాటున అనేక మంది మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. డబ్బు, ఉద్యోగం, ఆహారం ఇస్తాం.. అందుకు బదులుగా తమ కోర్కెలు తీర్చాలంటూ అక్కడి మహిళల్ని వేధిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. చాలా మంది మహిళలు తమ పట్ల హ్యుమానిటేరియన్ ఎయిడ్ వర్కర్లు చేస్తున్న వేధింపులను బయటపెట్టారు. ‘వారాల తరబడి నా ఆరుగురు పిల్లలకు కడుపు నిండా ఆహారం పెట్టలేకపోయాను. అదే సమయంలో ఓ వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని నన్ను నమ్మించాడు. దీంతో అతడిని నమ్మి వెళ్తే నన్ను ఓ ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా నిలదీయగా కొంత డబ్బు, ఆహారం ఇచ్చాడు. జాబ్ మాత్రం ఇవ్వలేదు’ అంటూ ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని సదరు మీడియా సంస్థతో పంచుకుంది.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచి లోదుస్తులపై పశ్నలు వేసినట్లు మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగని ఆ వ్యక్తి.. ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ తెలిపింది. అయినా లాభం లేదని పేర్కొంది. ఇలా ఈ రెండేండ్ల యుద్ధంలో ఎన్నో అఘాయిత్యాలు గాజాలో చోటు చేసుకున్నాయి. మహిళలకు ఉద్యోగం, ఆహారం, డబ్బు ఆశజూపి యూఎన్ఆర్డబ్ల్యూఏ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపుల నుంచి రక్షించే పెసా (PESA) వింగ్‌కు గతేడాది 18 ఫిర్యాదులు వచ్చాయి. అయితే, అవన్నీ చిన్నచిన్న కేసులే అని కొట్టిపారేశారు. అయితే, బయటకు రాని వాళ్లు వందల్లోనే ఉంటారని అంచనా. చాలా మంది మహిళలు లైంగిక దోపిడీకి గురై గర్భం దాల్చినట్లు కూడా గాజాలోని వైద్యులు చెబుతుండటం అక్కడి పరిస్థితికి అద్ధం పడుతోంది. యుద్ధం ఆగి శాంతి నెలకొంటే తప్ప మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగేలాలేవు.
Also Read..
Elephant | పార్క్‌లో టూరిస్ట్‌ల బోట్లను వెంబడించిన ఏనుగు.. షాకింగ్ వీడియో
గాజా యుద్ధానికి తెరపడేనా?.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం