వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో చర్చలు జరిపిన అనంతరం గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలస్తీనాలో దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రూపొందించిన 20 సూత్రాల ప్రణాళికను వారు విడుదల చేశారు. కాల్పుల విరమణ విధివిధానాలను స్థూలంగా వివరించిన ట్రంప్ గాజాలో యుద్ధాన్ని నిలిపివేసేందుకు, బందీల విడుదలకు, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు దీన్ని రూపొందించినట్లు చెప్పారు.
ఈ ప్రతిపాదనలకు హమాస్ అంగీకరించని పక్షంలో ఆ గ్రూపును పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ సహకారం ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. గాజాలో శాంతి స్థాపనే ఈ ప్రణాళిక లక్ష్యమని నెతన్యాహు తెలిపారు. హమాస్ తన ఆయుధాలను పూర్తిగా వదిలిపెట్టాలని, గాజాలో శాంతియుత ప్రభుత్వం ఏర్పడాలని ఆయన చెప్పారు.
గాజా నుంచి తన బలగాలను ఇజ్రాయెల్ క్రమంగా ఉపసంహరించుకుంటుందని హామీ ఇస్తూ అయితే సులంభంగానైనా క్లిష్టంగానైనా ప్రక్రియను కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 9న ఖతార్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి నెతన్యాహు క్షమాపణ చెప్పారు. హమాస్ చీఫ్ ఖలీల్ అల్-హయ్యాని ఖతార్‌లో హతమార్చేందుకు ఇజ్రాయెలీ సైన్యం ప్రయత్నించింది. ఈ దాడి నుంచి అల్-హయ్యా తప్పించుకోగా ఖతారీ అధికారితోసహా ఆరుగురు మరణించారు.
అయితే ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. తమకు ఇంకా ముసాయిదా అందలేదని తెలిపిన హమాస్ ఆయుధాలు విడిచిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
తన 20 సూత్రాల శాంతి ప్రతిపాదనపై స్పందించేందుకు హమాస్‌కు మూడు, నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో కాల్పుల విరమణ, బందీలను 72 గంటల్లో హమాస్ విడుదల చేయడం, హమాస్ నిరాయుధీకరణ, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు దశలవారీగా ఉపసంహరణ, ట్రంప్ సారథ్యంలో గాజాలో ఆపద్ధర్మ ప్రభుత్వం వంటివి ఉన్నాయి. తన శాంతి ప్రతిపాదనలు అంగీకరించేందుకు హమాస్‌కు 3, 4 రోజులు గడువు మాత్రమే ఇస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. మిగిలిన అన్ని పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేశాయని, హమాస్ సంతకం చేయకపోతే దాని కథ విషాదాంతం అవుతుందని హెచ్చరించారు.