US Immigration | అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం (Donald Trump) ఇమ్మిగ్రేషన్ నిబంధనల (Immigration) అమలును కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ దెబ్బకు యూఎస్‌లో నివసిస్తున్న విదేశీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని భయంతో వణికిపోతున్నారు. బహిష్కరణ భయంతో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (Immigration and Customs Enforcement) అధికారుల కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ (Food Delivery Worker) ఇమ్మిగ్రేషన్ అధికారులను చూసి పారిపోతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారిని గుర్తించి బహిష్కరిస్తోంది. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అమెరికా వ్యాప్తంగా వలసదారులను గుర్తించేపనిలో పడ్డారు. ఈ క్రమంలో చికాగో (Chicago) డౌన్‌టౌన్ (downtown) లో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో బైక్‌పై అటుగా వచ్చిన ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్.. ఇమ్మిగ్రేషన్ అధికారులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అతడిని చూసిన అధికారులు అతన్ని పట్టుకోండి అంటూ అరిచారు. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా అక్కడి నుంచి తన బైక్‌తో పరుగులు తీశాడు. అధికారులు వెంబడించినా చిక్కకుండా తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుత వ్యవస్థ విచ్ఛిన్నమైందని, వలసదారులు తరచుగా బహిష్కరణ భయంతో జీవించాల్సి వస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
EXCLUSIVE: Earlier today ICE agents chase after a man in downtown Chicago after he made verbal comments but no physical or threatening contact. The man was able to get away. pic.twitter.com/uOiHXSmQny
— Christopher Sweat (@SweatEm) September 28, 2025
మరోవైపు విదేశీ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) ప్రోగ్రామ్ కింద ప్రత్యేకంగా రెండేళ్ల స్టెమ్-ఓపీటీ పొడిగింపులో ఉన్న విదేశీ విద్యార్థుల నివాసాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు 3.3 లక్షలకు పైగా ఉండగా వీరిలో ఓపీటీలో 97,500 మంది నమోదై ఉన్నారు. ప్రభుత్వ తాజా చర్య భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కి చెందిన ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ(ఎఫ్డీఎన్ఎస్) నుంచి అధికారులు విదేశీ విద్యార్థుల నివాసాలు, హాస్టళ్లను అప్రకటితంగా సందర్శిస్తున్నట్లు ఇమిగ్రేషన్ న్యాయవాదులు, విద్యార్థులు వెల్లడించారు.
వీసా నిబంధనలను విదార్థులు పాటిస్తున్నదీ లేనిదీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. విద్యార్థి చదువుతున్న చదువుకు, ఫామ్ I-983 కింద తీసుకున్న శిక్షణ ప్రణాళికకు పొంతన ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయడంతోపాటు వ్యాలీడ్ ఎఫ్-1 స్టేటస్‌ని నిర్వహిస్తున్నదీ లేనిదీ అధికారులు చూస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా అధికారులు ధ్రువీకరణ పత్రాలతోపాటు కొన్ని కీలక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉద్యోగ విధులేమిటి, అవి విద్యార్థి డిగ్రీకి ఏ విధంగా సంబంధించినవి, పని గంటలు, జీతం, శిక్షణ లక్ష్యాలు, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) నిబంధనలు, హాజరు, విద్యార్హతలు వంటి ప్రశ్నలు విద్యార్థులకు అధికారుల నుంచి ఎదురవుతున్నాయి.
Also Read..
Donald Trump | ట్రంప్ మరో టారిఫ్ బాంబ్.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత
PM Modi | పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గం.. గాజాపై ట్రంప్ ఫార్ములాను స్వాగతించిన భారత్
Donald Trump | యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు.. గాజాపై ట్రంప్ ప్రణాళికను అంగీకరించిన ఇజ్రాయెల్