ఇస్లామాబాద్: ఉత్తర పాకిస్థాన్(Pakistan)లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులోని బునేర్ జిల్లాలో సుమారు 350 మంది మరణించారు. ఇంకా 200 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. సోమవారం రెస్క్యూ ఆపరేషన్ స్తంభించింది. దేశవ్యాప్తంగా భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల అనేక నదుల్లో నీటి మట్టం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ నష్టం జరిగింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. రెస్క్యూ వర్కర్లకు వాలంటీర్లు సహకరిస్తున్నారు.
ఇవాళ ఉదయం మళ్లీ వర్షం కురవడంతో.. రిలీఫ్ ఆపరేషన్స్ నిలిపివేశారు. బునేర్ జిల్లాలో 12 గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయని, 219 మంది మృతదేహాలను రికవరీ చేశారు. బురద, రాళ్ల కింద డజన్ల సంఖ్యల మృతదేహాలు చిక్కుకున్నాయి. ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లేరు. శుధ్దమైన నీరు, ఆహార కొరత ఉన్నట్లు ఓ వాలంటీరు పేర్కొన్నాడు.
గత ఏడాదితో పోలిస్తే వర్షాకాలం 50 నుంచి 60 శాతం అధికంగా ఉన్నట్లు నేషనల్ డిజాస్టర్ ఏజెన్సీ తెలిపింది. 2022లో వచ్చిన వర్షాల వల్ల మూడో వంతు దేశం నీట మునిగింది. అప్పట్లో సుమారు 1700 మంది మరణించారు.