సోమవారం 01 జూన్ 2020
International - Apr 08, 2020 , 11:40:24

వుహాన్ విముక్తి.. క‌దిలిన‌ రైళ్లు, ఎగిరిన‌ విమానాలు

వుహాన్ విముక్తి.. క‌దిలిన‌ రైళ్లు, ఎగిరిన‌ విమానాలు

హైద‌రాబాద్‌: 76 రోజుల త‌ర్వాత నిర్బంధం ముగిసింది. లాక్‌డౌన్ నుంచి వుహాన్ విముక్తి పొందింది. జ‌న‌వ‌రి 23వ తేదీన లాక్‌డౌన్‌కు గురైనా చైనా న‌గ‌రం వుహాన్ మ‌ళ్లీ బిజీబిజీగా మారింది.  నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల హుబేయ్ ప్రావిన్సులో జ‌న‌జీవ‌నం స్తంభించిన విష‌యం తెలిసిందే. అయితే 11 వారాల విరామం త‌ర్వాత‌.. ఆ ప్రావిన్సులోని వుహాన్ న‌గ‌రం నుంచి రైళ్లు క‌ద‌లిలాయి.  అర్థ‌రాత్రి నుంచే టోల్ గేట్ల వ‌ద్ద సీటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు కార్లు క్యూ క‌ట్టాయి. ఇక విమానాలు కూడా అంత‌ర్జాతీయ మార్గాల‌కు స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేశాయి.

వుహాన్ నుంచి తొలి బుల్లెట్ రైలు ఉద‌యం 7.06 నిమిషాల‌కు క‌దిలింది. అంత‌కుముందే 6.30 నిమిషాల‌కు ఓ లోక‌ల్ ట్రైన్ జాంగ్‌జూకు ప‌య‌న‌మైంది. ఇక ఉద‌యం 7.24 నిమిషాల‌కు వుహాన్ తియ‌నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి విమానం ఎగిరింది.  46 మంది ప్ర‌యాణికుల‌తో ద‌క్షిణ చైనాలో ఉన్న సాన్య న‌గ‌రానికి అది వెళ్లింది. జ‌న‌వ‌రి 23వ తేదీ త‌ర్వాత మ‌ళ్లీ వుహాన్‌లో రైళ్లు, విమానాల క‌దలిక‌లు మొద‌ల‌య్యాయి. దీంతో అక్క‌డ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. 

వుహాన్ నుంచి బీజింగ్ వెళ్తున్న‌వారికి అక్క‌డ న్యూక్లియ‌ర్ యాసిడ్ టెస్టింగ్ నిర్వ‌హించ‌నున్నారు. హుబేయ్ నుంచి వెళ్లేట‌ప్పుడు,  ఆ త‌ర్వాత బీజింగ్ చేరుకున్న త‌ర్వాత కూడా క‌చ్చితంగా న్యూక్లియర్ యాసిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను బుధ‌వారం పూర్తిగా ఎత్తివేయ‌డంతో వుహాన్ ప్ర‌జ‌లు మ‌ళ్లీ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు పూర్తిగా అదుపులో ఉన్న‌వారే బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తిచ్చారు.

మంగ‌ళ‌వారం రోజున చైనాలో కొత్త‌గా 62 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దాంట్లో 59 మంది విదేశాల నుంచి వ‌చ్చారు. మూడు దేశీయ కేసులు ఉన్న‌ట్లు నిర్ధారించారు. హుబేయ్ ప్రావిన్సులో ఒక‌రు, షాంఘైలో ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు చెప్పారు. ఎటువంటి ల‌క్ష‌ణాలు లేన‌టువంటి వెయ్యి మంది పేషెంట్ల‌ను అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. logo