వాషింగ్టన్ : ఇరాన్‌పై మళ్లీ భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతున్నదా? 24 గంటల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా 6,500 టన్నుల ఆయుధ సామగ్రి తరలించడంతో ఇదే అనుమానం వ్యక్తమవుతున్నది. రెండు కార్గో నౌకలు, పలు విమానాల్లో ఈ సామగ్రి చేరుకుంది. భూతల, గగనతల దాడులకు వినియోగించే ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలిటరీ ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వాహనాలు ఇందులో ఉన్నట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ టైమ్స్, ద జెరూసలేం పోస్ట్ వెల్లడించాయి. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు అమెరికా 1,15,600 టన్నుల మిలిటరీ సామగ్రిని అందజేసింది. ఇరాన్‌ను చర్చలకు రప్పించడమే లక్ష్యంగా అమెరికా తాజా దాడులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
యాక్సియోస్ మీడియా కథనం ప్రకారం ఇరాన్‌పై సైనిక చర్య కోసం యూఎస్ సెంట్రల్ కమాండ్ మూడు ప్రణాళికలు సిద్ధం చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు ఉంచింది. ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలతో పాటు, పలు ముఖ్యమైన భవనాలు లక్ష్యంగా సంక్షిప్త, శక్తిమంతమైన దాడులు నిర్వహించాలని యూఎస్ సెంట్రల్ కమాండ్ నిర్ణయించింది. ఈ దాడులతో ఇరాన్ చర్చలకు తప్పక వస్తుందని భావిస్తున్నది. వాణ్యి నౌకలు సాఫీగా వెళ్లేందుకు హొర్ముజ్ జలసంధిని పాక్షికంగా స్వాధీనం చేసుకోవాలన్నది దాని రెండో ప్రణాళిక. శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకోవాలని, దీనికోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలన్నది మూడో ప్రణాళిక.
ఒకవైపు యూఎస్-ఇజ్రాయెల్‌తో పోరు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ నాయకత్వంలో విభేదాలు ఏర్పడినట్టు వార్తలొస్తున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ జన బాహుళ్యానికి దూరంగా ఉండటంతో నడిపించే సరైన నాయకుడు లేక ఉన్నత స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి. దీని కారణంగానే వాషింగ్టన్‌తో శాంతి చర్చల విషయంలో ఇరాన్ ముందుకు వెళ్లలేకపోతున్నట్టు సమాచారం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వైఖరిపై అధ్యక్షుడు పెజిష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘాలిబఫ్లు అసంతృప్తిగా ఉన్నారు. అతడు తమతో కలిసి పనిచేయకుండా మిలిటరీ గ్రూప్ ఐఆర్జీసీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని వారు భావిస్తున్నారు. అధ్యక్షుడికి తెలియకుండానే అరాగ్చీ ప్రధాన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా జరుగుతున్న వదంతులకు ఇరాన్ అధికారికంగా తెరదించింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, వ్యవహారాలను చురుగ్గా పర్యవేక్షిస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
అత్యంత అధునాతన డార్క్ ఈగిల్ హైపర్‌సానిక్ క్షిపణిని ఇరాన్ యుద్ధంలో దించాలని అమెరికా మిలిటరీ యోచిస్తున్నది. అధికారికంగా లాంగ్-రేంజ్ హైపర్‌సానిక్ వెపన్ (ఎల్ఆర్హెచ్డబ్ల్యూ)గా పిలిచే డార్క్ ఈగిల్ అత్యంత వేగంతో కూడిన సుదూర దాడుల కోసం రూపొందించారు. ధ్వనికంటే ఐదు రెట్ల వేగంతో ప్రయాణించల సామర్థ్యం కలిగి ఉన్న ఈ క్షిపణి వ్యవస్థను అడ్డుకోవడం చాలా కష్టం. 1,725 మైళ్ల పరిధి దాటి వెళ్లే ఈ ఒక్కో క్షిపణి ధర 15 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం అమెరికా వద్ద ఎనిమిది మాత్రమే అందుబాటులో ఉన్నాయి.