ప్రాగ్, ఫిబ్రవరి 22: యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రవేశపెట్టిన వ్యవసాయ పాలసీలపై రైతులు గళమెత్తారు. తమకు చేటుచేసే ఈ విధానాలు వద్దనే వద్దంటూ ఈయూకు చెందిన 10 దేశాల రైతులు ఆందోళనలో భాగస్వాములయ్యారు. తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్న పొరుగున ఉన్న జర్మనీ, పోలాండ్, స్లొవేకియా తదితర దేశాలకు చెందిన సహచరులను కలవడానికి చెక్ రైతులు ఆయా దేశాల సరిహద్దు మార్గాల వైపు తమ వాహనాలతో తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా చెక్ వ్యవసాయ మంత్రి, స్లొవేకియా మంత్రి, పోలాండ్, హంగేరి తదితర దేశాల వ్యవసాయ శాఖల ప్రతినిధుల ఆధ్వర్యంలో చెక్-స్లొవేకియా సరిహద్దు వద్ద ర్యాలీ జరిపారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ ఇటీవల ప్రవేశపెట్టిన పర్యావరణ విధానాల పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రసాయనాలు, గ్రీన్ గ్యాస్ ఉద్గారాల వినియోగాన్ని పరిమితం చేసే గ్రీన్ డీల్‌పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షలు తమ వ్యవసాయ ఉత్పత్తుల తయారీని పరిమితం చేస్తాయని, ఈయూయేతర దేశాల కన్నా తమ ఉత్పత్తులను ఖరీదైనవిగా చేస్తాయని, తద్వారా పంటల వాణిజ్యం దెబ్బ తింటుందని తెలిపారు.