ఆదివారం 17 జనవరి 2021
International - Dec 10, 2020 , 01:47:14

‘ఫేస్‌ షీల్డ్‌' ఒక్కటే కాపాడలేదు

‘ఫేస్‌ షీల్డ్‌' ఒక్కటే కాపాడలేదు

  • మాస్కు కూడా ధరించాల్సిందే
  • జపాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

టోక్యో: కరోనా వైరస్‌ సోకకుండా ఫేస్‌ షీల్డ్‌ (ముఖానికి పెట్టుకునే ప్లాస్టిక్‌ కవచం) ఒక్కటే పూర్తి స్థాయిలో రక్షించలేదని, ముఖానికి మాస్కు కూడా తప్పనిసరిగా ధరించాలని జపాన్‌లోని ఫుకోకా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. సమీపంలోని వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఆ తుంపర్లు ఫేస్‌ ఫీల్డ్‌ను దాటుకొని ప్రయాణించగలవని వెల్లడించారు. ఎవరైనా తుమ్మినప్పుడు ఆ తుంపర్లలోని కొన్ని అతి సూక్ష్మ కణాలు.. వొర్టెక్స్‌ రింగ్స్‌ (సుడిగుండాలను పోలిన వలయాకార రింగులు) ఆకారాన్ని సంతరించుకొని ఫేస్‌ షీల్డ్‌.. పై అంచు లేదా కింది అంచుల నుంచి ప్రయాణించగలవని ఫుజియో అకాగీ అనే శాస్త్రవేత్త తెలిపారు. తుమ్మిన వెంటనే 0.5 నుంచి ఒక్క సెకండులోనే సుమారు మీటరు దూరం వరకూ ఇవి ప్రయాణించగలవన్నారు. తుమ్మినప్పుడు విడుదలైన మొత్తం తుంపర్లలో సగటున 4.4 శాతం తుంపర్లు ఫేస్‌ షీల్డ్‌ను దాటుకొని ప్రయాణించగలవని వివరించారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఫేస్‌ షీల్డ్‌తో పాటు ముఖానికి మాస్కును ధరించడం అవసరమని తెలిపారు.