వాషింగ్టన్, నవంబర్ 21: ఆ చందమామలో ఆనందసీమలో అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తున్నది. సుదీర్ఘకాలం చంద్రునిపై నివసించడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు మానవ రహిత ఓరియన్ అంతరిక్ష నౌకను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నౌక గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నాలుగున్నర లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. మరో 60 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రున్ని చేరుకున్నట్టే. ఆర్టెమిస్ మిషన్లో భాగంగా దానిని ప్రయోగించారు. చంద్రునిపై నివాసాల ఏర్పాటుకు అవసరమైన కీలక సమాచారాన్ని ఈ మిషన్ సేకరించి పెడుతుందని మిషన్ అధికారి హోవార్డ్ హూ తెలిపారు. చంద్రధూళిని, సౌరశక్తిని ఉపయోగించి ఇటుకలను తయారు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో మనుషుల్ని చంద్రునిపైకి పంపించాలని అనుకొంటున్నట్టు ఆయన చెప్పారు. అయితే వారంతా శాస్త్రవేత్తలే అయి ఉంటారని ఆయన తెలిపారు. ఇది కేవలం అమెరికాను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది కాదని, ప్రపంచ దేశాలన్నీ ఇందులో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓరియన్ తరహా అంతరిక్ష నౌకల్లోనే మనుషుల్ని చంద్రునిపైకి చేరవేయాల్సి ఉంటుందని కూడా హోవార్డ్ హూ అన్నారు. చంద్రునిపై శాస్త్రవేత్తలకు వసతి, భోజన సౌకర్యాలతో పాటుగా.. శాస్త్ర ప్రయోగాలకు ల్యాబొరేటరీలు అవసరమవుతాయని చెప్పారు. జర్మనీలోని కొలోన్లో ప్రస్తుతం చంద్రునిపై నిర్మాణాలకు అవసరమయ్యే ఇటుకల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడ చంద్రధూళికి బదులుగా అగ్నిపర్వతాల బూడిదతో ఇటుకలు తయారు చేస్తున్నారు. చంద్ర ధ్రువ ప్రాంతాలు మానవ నివాసానికి యోగ్యంగా ఉండొచ్చని హోవార్డ్ హూ చెప్పారు. సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం నుంచి మనుషులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు అవసరమైతే ఉపరితలం మీద కాకుండా భూగృహాలు నిర్మించాల్సి రావచ్చని చెప్పారు.