బుధవారం 27 జనవరి 2021
International - Jan 13, 2021 , 13:33:33

ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ..

ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ..

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి డొనాల్డ్ ట్రంప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేయనున్నారు. దాంతో ట్రంప్ పదవీకాలం ముగిసిపోతుంది. అప్పటి నుంచి ట్రంప్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ హిల్‌పై దాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో ప్రజలు ట్రంప్‌ సంస్థలతో పనిచేయడం మానేయాలని నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిపోక ముందే ఆయన వ్యక్తిగత బ్యాంకు ఖాతాను మూసివేస్తున్నట్లు సిగ్నేచర్‌ బ్యాంకు ప్రకటించడం సంచలనం రేపింది. ఇదేసమయంలో క్యాపిటల్‌ హిల్‌ సంఘటనతో ట్రంప్‌ ఆస్తులకు కూడా ముప్పు పొంచివుంది. 

డొనాల్డ్‌ ట్రంప్ వ్యక్తిగత ఖాతాలను సిగ్నేచర్ బ్యాంక్ సోమవారం నుంచి మూసివేయడం ప్రారంభించింది. కాపిటల్ హిల్ పైభాగంలో మాజీ వాషింగ్టన్ డీసీ పోస్టాఫీసుపైన నిర్మించిన ట్రంప్‌ హోటల్.. గత నాలుగేండ్లుగా ట్రంప్‌తో వ్యాపారం కోసం వచ్చే విదేశీ ప్రభుత్వాలు ఇక్కడే గదులు బుక్ చేసుకుంటూ.. ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నాయి. దాంతో ట్రంప్ కుటుంబం భారీగా సంపాదిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రదేశంలో హోటళ్ళు నడపడం ఇప్పుడు ట్రంప్‌ను బాధపెట్టనున్నది. ఇలాంటి వ్యవహరాలపై పలువురు రాజకీయ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వాషింగ్టన్‌లోని ఆస్తితోపాటు తన అనేక హోటళ్ళు, వ్యాపారాలను కోల్పోయాడని, గత వారం జరిగిన సంఘటన అనంతరం చాలా కంపెనీలు ట్రంప్‌తో వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నాయని వాషింగ్టన్‌లోని సిటిజెన్స్ ఫర్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ ఎథిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోహ్ బుక్‌బైండర్ పేర్కొన్నారు. "ట్రంప్‌కు ఇది చాలా కష్టమైన సమయం" అని డొనాల్డ్‌ ట్రంప్ జీవిత చరిత్ర రాసిన రచయిత మైఖేల్ డీ ఆంటోనియో అన్నారు. యూఎస్‌లో హింస వారి కంపెనీలకు మార్కెట్‌లోకి ప్రతికూలతను తెచ్చిపెట్టిందని తెలిపారు. ప్రజల వైఖరి ఇప్పుడు మారుతుందని అనుకోవడం లేదని, చాలా బ్రాండ్లు విభేదాలను నివారించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రంప్‌తో కలిసి పనిచేయాలా వద్దా అనే విషయాన్ని ఇప్పుడు కంపెనీలే నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు.

ట్రంప్ ఆర్గనైజేషన్ క్లోజింగ్ లోన్స్ ద్వారా బ్యాంక్ రుణాలు ఇవ్వాలనుకుంటున్నారా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. డచ్‌ బ్యాంక్ గత పదేండ్లలో ట్రంప్ కంపెనీలకు 300 మిలియన్ల డాలర్లకు పైగా రుణాలు ఇచ్చింది. అయితే, డచ్‌ బ్యాంక్ గత ఏడాది మనీలాండరింగ్ వ్యతిరేక నిపుణుడు టామీ మెక్‌ఫాడెన్‌ను తొలగించింది. బ్యాంక్ వైఖరిపై టామీ ఆందోళన వ్యక్తం చేశారు. డచ్‌ బ్యాంక్‌లో ట్రంప్‌కు అత్యంత సన్నిహితమైన ఇద్దరు ప్రైవేట్ బ్యాంకర్లు కూడా గత నెలలో రాజీనామా చేశారు.

42 మిలియన్‌ డాలర్ల రుణానికి వ్యక్తిగత హామీ

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, 42.1 మిలియన్‌ డాలర్లు ట్రంప్ వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన రుణాలుగా ఉన్నాయి. ఈ రుణాలు చాలావరకు ఇతర దేశాల బ్యాంకులు లేదా సంస్థల నుంచి తీసుకున్నారు. వాటిని నాలుగేండ్లలో తిరిగి చెల్లించాలి. 2008, 2009 మధ్య తన కంపెనీలు 140 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయని 2010 లో ట్రంప్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారని ఆర్థిక విషయాలపై దర్యాప్తు చేస్తున్న అమెరికా పరిశోధనా సంస్థ ఐఆర్‌ఎస్ తెలిపింది.

ట్రంప్ మద్దతుదారులు గత వారం యూఎస్ కాపిటప్‌పై దాడి చేయడంతో నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా చాలా కంపెనీలు ట్రంప్‌తో సంబంధాలను ముగించాయి. ట్రంప్‌కు చెందిన న్యూజెర్సీ గోల్ఫ్ కోర్సులో పీజీఏ అమెరికా ఇకపై ఛాంపియన్‌షిప్‌లు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కూడా ఇప్పటికే ట్రంప్ ఖాతాలతోపాటు క్యాపిటల్‌ హిల్‌పై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ట్రంప్‌ మద్దతుదారుల అకౌంట్లను కూడా సస్పెండ్ చేశాయి.

ఇకపై విరాళాలు అందవేమో..

ఎలక్టోరల్ కాలేజీ ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులకు కూడా ట్రంప్‌ కారణంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. ట్రంప్‌ వైఖరి కారణంగా అమెరికా పెద్ద కంపెనీలు రిపబ్లికన్‌లకు విరాళాలు ఇవ్వడానికి ఇకపై నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్, కామర్స్ బ్యాంక్, డౌ కెమికల్, మారియట్, మాస్టర్ కార్డ్, అమెజాన్ ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించడాన్ని వ్యతిరేకించిన 147 మంది రిపబ్లికన్లకు చాలా కంపెనీలు విరాళాలు ఇవ్వవు. వీరిలో మిస్సౌరీకి చెందిన సెనేటర్ జోష్ హౌల్, కాన్సాస్‌కు చెందిన సెనేటర్ రోజర్ మార్షల్, టెక్సాస్‌కు చెందిన సెనేటర్ టెడ్ క్రజ్, అలబామాకు చెందిన సెనేటర్ టామీ ట్యూబర్‌విల్లే, వందలాది మంది ఇతర కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.

500కు పైగా వ్యాపారాలు

ట్రంప్ కుటుంబానికి దాదాపు 500 రకాల వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అతని పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి. హోటళ్ళు, రిసార్ట్స్, మల్టీ మిలియన్ డాలర్ల గోల్ఫ్ క్లబ్‌లు ఉన్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభలిన సమయంలో ట్రంప్ కంపెనీలు మిలియన్ డాలర్లను కోల్పోయాయని ఫోర్బ్స్ పత్రిక ఒక నివేదికలో తెలిపింది. ఈ సమయంలో అతని నికర విలువ 100 మిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఫోర్బ్స్ ప్రకారం, ట్రంప్ నికర విలువ 2.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.18,308 కోట్లు). 

ట్రంప్‌ కుటుంబ నిర్వహణలోని వ్యాపారాలు..

వాణిజ్య రియల్ ఎస్టేట్

ట్రోఫీలు, ఇతర ఎస్టేట్

గోల్ఫ్ కోర్సులు

రెసిడెన్షియల్‌ రియల్ ఎస్టేట్

హోటల్ లైసెన్సింగ్, నిర్వహణ

హాస్పిటాలిటీ హోల్డింగ్స్

ట్రంప్ జీవిత చరిత్ర రాసిన మైఖేల్‌ డీ ఆంటోనియో ప్రకారం, అతను మీడియాను ఎక్కువగా ప్రేమిస్తాడు. 2016 లో హిల్లరీ క్లింటన్ చేతిలో ఓడిపోతానని భావించిన సమయంలో.. ప్రచారం కోసం ఒక మీడియా సంస్థను ప్రారంభించాలని అనుకున్నాడు. కాగా, భారతదేశంలో ముంబై, పుణేలో డొనాల్డ్ ట్రంప్.. ట్రంప్ టవర్‌ను నిర్మించారు. ఈ టవర్‌ను పంచీల్ డెవలపర్స్‌తో కలిసి ట్రంప్‌ నిర్మించారు. ముంబైకి చెందిన టవర్‌ను లోధా గ్రూప్ నిర్మించింది. పుణేలో నిర్మించిన 23 అంతస్తుల ట్రంప్ టవర్.. దేశంలో మొదటి పర్యావరణ అనుకూల భవనం కావడం విశేషం. బాలీవుడ్ తారలు కూడా ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. దీనిలోని ఒక్కో ఫ్లాట్ ధర రూ.15 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ట్రంప్‌కు గుర్గావ్‌లోని ఎం 3 ఎం ఇండియా, గుర్గావ్‌లోని ఐఆర్‌ఈఓ, కోల్‌కతాలోని యూనిమార్క్ గ్రూప్, రియల్ ఎస్టేట్‌తో సంబంధాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

అంతరిక్షం నుంచి నా దేశాన్ని చూస్తున్నా..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo