వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేది లేదని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు స్పష్టంచేశాయి. గ్రీన్లాండ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు పట్టుబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈయూ దేశాలపై కొత్త టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఈయూ ప్రతిచర్యలకు దిగింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందానికి యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తెలపలేదు. దీంతో నిరుడు కుదిరిన ట్రాన్స్అట్లాంటిక్ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వోన్ డెర్ లేయెన్ ఈ ఒప్పందంపై నిరుడు జూలైలో సంతకాలు చేశారు. ఈయూ గూడ్స్‌పై అమెరికా టారిఫ్‌లను 15 శాతానికి పరిమితం చేయాలని, అమెరికన్ ఎగుమతులపై ఈయూ సుంకాలను తొలగించాలని ఈ ఒప్పందం చెప్తున్నది.
గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ ఒప్పందం కుప్పకూలింది. గ్రీన్లాండ్కు దళాలను పంపించిన ఈయూ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. జూన్ 1 నుంచి ఇది 25 శాతానికి పెరుగుతుందన్నారు. గ్రీన్లాండ్ కొనుగోలు పూర్తయ్యే వరకు ఈ టారిఫ్ కొనసాగుతుందని హెచ్చరించారు. కొత్త టారిఫ్‌లపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా స్పందిస్తూ, ఇది కొనసాగితే, ఈయూ సంయుక్తంగా స్పందిస్తుందన్నారు. ఇదిలావుండగా, యూరోపియన్ నేతల వాదన మరో విధంగా ఉంది. ఉత్తర అట్లాంటిక్‌లో రష్యా, చైనా కార్యకలాపాలు పెరుగుతున్నాయని ట్రంప్ స్వయంగా హెచ్చరించారని, అందుకే తాము దళాలను పంపించామని, అమెరికాను రెచ్చగొట్టడం తమ లక్ష్యం కాదని తెలిపారు.
ట్రంప్ చర్యలు ప్రమాదకరం
గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణను వ్యతిరేకించిన ఈయూ దేశాలపై 10 శాతం టారిఫ్‌లు విధించడం పూర్తిగా తప్పు అని ఈయూ దేశాలు తెలిపాయి. ఈయూ తన సభ్య దేశాల (27) రాయబారులతో అత్యవసర సమావేశాన్ని ఆదివారం నిర్వహించింది. ట్రంప్ చర్యలు పెను ప్రమాదాన్ని సృష్టిస్తాయని హెచ్చరించింది. నాటో సభ్య దేశాలు, మిత్రుల మధ్య ఘర్షణల వల్ల రష్యా, చైనాల చేతికి ఓ అవకాశం అందుతుందని తెలిపాయి. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వోన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లలో, టారిఫ్‌ల వల్ల ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకునేందుకు యూరోప్ ఐకమత్యంగా ఉంటుందని, సమన్వయంతో పని చేస్తుందని తెలిపారు. టారిఫ్‌లపై దృఢంగా వ్యవహరించాలని యూరోపియన్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని గ్రీన్లాండ్ స్వాగతించింది.
గ్రీన్లాండ్కు ఈయూ దేశాల సంఘీభావం
ట్రంప్ విధించిన టారిఫ్‌ల దెబ్బ పడిన ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలు ఆదివారం సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. డెన్మార్క్ కింగ్డమ్, గ్రీన్లాండ్ ప్రజలకు సంఘీభావం ప్రకటించాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము గ్రీన్లాండ్కు మద్దతిస్తున్నట్లు డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్ స్పష్టం చేశాయి. నాటో సభ్యులుగా తాము ఆర్కిటిక్ భద్రతను పటిష్టపరచడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. టారిఫ్ బెదిరింపుల వల్ల ట్రాన్స్అట్లాంటిక్ సంబంధాలు దెబ్బతింటాయని, పరిస్థితులు ప్రమాదకరమైన వేగంతో దిగజారుతాయని హెచ్చరించాయి.