బ్రస్సెల్స్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాను కట్టడి చేసేందుకు ఈయూ దేశాలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసే అంశంలో ఈయూ దేశాలు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాయి. రష్యా నుంచి దిగుమతి అవుతున్న ఇంధనంలో రెండింట మూడవ వంతును ఆపేయాలని ఆ దేశాలు భావించాయి. బ్రస్సెల్స్లో జరిగిన ఈయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. సముద్ర మార్గంలో వచ్చే ఇంధన దిగుమతిపై బ్యాన్ విధిస్తున్నట్లు ఈయూ చెప్పింది. కానీ పైప్లైన్ ద్వారా సరఫరా అవుతున్న ఇంధన దిగుమతిని కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల హంగేరికి ఊరట కలిగింది. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు యురోపియన్ కౌన్సిల్ చీఫ్ చార్లెస్ మైఖేల్ తెలిపారు. ఆరవ ఆంక్షల ప్యాకేజీపై 27 సభ్య దేశాలు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈయూ దిగుమతి చేస్తున్న ఇంధనంలో 27 శాతం రష్యానే ఇస్తోంది. హంగేరి, బల్గేరియా దేశాలకు మాత్రమే రష్యా ఆయిల్ కొనుగోలుకు అవకాశం ఇచ్చారు.