వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరో కొత్త పార్టీ అవతరించింది. రిపబ్లికన్, డెమొక్రాట్లకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) నూతన రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. ట్రంప్ కలల బిల్లు అయిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను (Big Beautiful Bill) ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాట్లు చేస్తానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయడం, అది చట్టం రూపం దాల్చడం జరిగిపోయాయి. దీంతో ‘ది అమెరికా పార్టీ’ ని (The America Party) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ అన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది’ అని పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన మస్క్, ఎక్స్ వినియోగదారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ఈ నీర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
By a factor of 2 to 1, you want a new political party and you shall have it!
When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.
Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN
— Elon Musk (@elonmusk) July 5, 2025
ట్రంప్ కలల బిల్లుగా చెప్పుకున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లును మస్క్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో ఈ బిల్లు కారణంగా మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఓ సందర్భంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి, అమెరికన్ల రుణాన్ని పెంచే ప్రజాదరణ లేని ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే చట్ట సభ సభ్యులను పదవీచ్యుతులను చేస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు.
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీ పెడతానంటూ హెచ్చరించారు. ‘ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం గురించి ప్రచారం చేసి.. ఇప్పుడు చరిత్రలో అతిపెద్ద రుణభారాన్ని పెంచే బిల్లుపై ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తల దించుకోవాలి. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీకి సమయం ఆసన్నమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. మరుసటి రోజే ‘ది అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది’ అని మస్క్ హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా (జూలై 4) మస్క్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక పోల్‌ను నిర్వహించారు. ‘దాదాపు రెండు శతాబ్దాలుగా అమెరికా రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న రెండు పార్టీల వ్యవస్థ నుంచి స్వాతంత్య్రం కావాలా?’ అని అడిగారు. ఈ సర్వేకు 1.2 మిలియన్లకు పైగా స్పందనలు వచ్చాయి. దీని ఆధారంగా మస్క్ అమెరికా పార్టీని ఆరంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Independence Day is the perfect time to ask if you want independence from the two-party (some would say uniparty) system!
Should we create the America Party?
— Elon Musk (@elonmusk) July 4, 2025