టెక్సాస్: బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) తన ఫ్యామిలీపై శ్రద్ధ పెట్టారు. 11 మంది పిల్లలు, వాళ్ల తల్లుల కోసం ఓ ఖరీదైన భవంతిని కొనేందుకు మస్క్ ప్లాన్ వేసినట్లు తెలసింది. ఉమ్మడి కుటుంబం స్టయిల్లో ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో సుమారు 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని బిల్డింగ్‌ను మస్క్ కొంటున్నారు. దాంట్లో ఆరు బెడ్రూమ్లు ఉంటాయి. టెక్సాస్ సమీపంలోని ఆస్టిన్‌లో ఉన్న అతనికి ఇంటికి సమీపంలోనే ఈ కొత్త బిల్డింగ్ ఉన్నది. సుమారు 35 మిలియన్ల డాలర్ల ఖరీదుతో ఆ బిల్డింగ్‌ను మస్క్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
అత్యంత విలాసవంతంగా ఉండే ఆ భవంతి.. టస్కన్ ప్రేరిత డిజైన్‌తో నిర్మించారు. టెక్సాస్‌లోని మస్క్ ఇంటికి కేవలం 10 నిమిషాల దూరంలో ఈ కొత్త మేడ ఉన్నది. పిల్లల మధ్య సఖ్యత ఏర్పడాలన్న ఉద్దేశంతో అందరికి కలిసి ఆ ఇంటిని తీసుకున్నాడు. ఇక ఆ పిల్లలతో షెడ్యూల్ ప్రకారం టైం గడిపేందుకు కూడా మస్క్ నిర్ణయించారు.
2022 నుంచి ఇప్పటి వరకు మస్క్‌కు 12 మంది పిల్లలు పుట్టారు. మాజీ భార్య జస్టిన్ మస్క్‌కు పుట్టిన తొలి బేబీ.. జన్మించిన 10 వారాల్లోనే మృతిచెందింది. 2008లో ఇదే జంట ఐవీఎఫ్ ద్వారా అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. గ్రిఫిన్, వివియన్ కవలలు పుట్టారు. ఆ తర్వాత సాక్సన్, డామియన్, కాయి పుట్టారు.
బ్రిటీష్ నటి తలూలా రిలేతో మస్క్ రిలేషన్లో ఉన్నారు. ఆమెను పెళ్లి చేసుకుని, రెండు సార్లు విడాకులు ఇచ్చారు. అయితే ఆ జంటకు పిల్లలు పుట్టలేదు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో మ్యూజిక్ స్టార్ గ్రైమ్స్‌తో మస్క్ ముగ్గురు పిల్లలు కన్నారు. మ్యుజీషియన్ గ్రైమ్స్ మరోపేరు క్లారి బౌచర్. ఎక్స్, ఎక్స్ట్రా డార్క్ సిడీరల్, టెక్నో మెకానికస్ అనే పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిల్లల కస్టడీ కోసం గ్రైమ్స్, మస్క్ మధ్య లీగల్ యుద్ధం నడుస్తున్నది.
2021లో శివోన్ జిల్లిస్ అనే మహిళతో రహస్యంగా రిలేషన్ కొనసాగించారు మస్క్. ఆమెకు ట్విన్స్ పుట్టారు. మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్‌లో శివోన్ జిల్లిస్ పనిచేస్తున్నది. ఈ మధ్యే మూడవ చిన్నారికి కూడా జన్మనిచ్చినట్లు మస్క్ ప్రకటించారు. అయితే కొత్తగా ఖరీదు చేసిన ఇంట్లోకి జిల్లిస్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.