Sri Lankan Navy | భారత్‌కు చెందిని ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ ఆదివారం అదుపులోకి తీసుకున్నది. మత్స్యకారులతో పాటు రెండు పడవలను సైతం స్వాధీనం చేసుకున్నది. పట్టుబడిన మత్స్యకారులు తమిళనాడులోని రామనాథపురానికి చెందిన వారు. మత్స్యకారులు మండపం నుంచి సముద్రం వైపు వెళ్లి పాక్ బే ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్నట్లు నేవీ అధికారులు ఆరోపించారు. సరిహద్దు దాటి వచ్చారని నేవీ పేర్కొంది. భారతదేశం- శ్రీలంక మధ్య సంబంధాల్లో మత్స్యకారుల సమస్య వివాదాస్పద సమస్యగా కొనసాగుతున్నది.
ఇలాంటి ఘటనలు ఎక్కువగా పాక్ జలసంధిలో జరుగుతుంటాయి. తమిళనాడు, ఉత్తర శ్రీలంక మధ్య ఉన్న స్ట్రిప్. ఇక్కడ ఎక్కువగా చేపల వేట సాగుతుంది. పట్టుబడిన జాలర్లను విచారణ అనంతరం జాఫ్నా మత్స్యశాఖ అధికారులకు అప్పగించారు. గతంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భారత జాలర్లను లంక నేవీ అరెస్టు చేస్తుండడం తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాయగా.. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.