వాషింగ్టన్: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందు, అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 2020 జనవరి తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
కాగా, ప్రవాస భారతీయులు విమానాశ్రయం వద్ద త్రివర్ణ పతాకాన్ని చేపట్టుకుని ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. వంద మందికిపైగా ప్రవాసులు ఎయిర్‌పోర్టుకి వచ్చారు. తన కోసం వేచిఉన్నవారిని కలిసిన మోదీ.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
‘వాషింగ్టన్లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం’ అని ప్రధాని మోదీ అన్నారు.
"Grateful to the Indian community in Washington DC for the warm welcome. Our diaspora is our strength. It is commendable how the Indian diaspora has distinguished itself across the world," tweets PM Narendra Modi pic.twitter.com/fXRif5I0oO
— ANI (@ANI) September 23, 2021
మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమోరికాలో తీరికలేకుండా గడపనున్నారు. తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగిస్తారు.
గురువారం పలువురు వ్యాపారవేత్తలతో భేటీకానున్నారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమవుతారు. శుక్రవారం అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్ అంశాలపై చర్చించనున్నారు.