Earthquake : మయన్మార్‌తోపాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquakes) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ చెప్పారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండటంవల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
మయన్మార్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా విపత్తు మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. కమ్యూనికేషన్ సరిగా లేకపోవడంవల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. కాగా ఈ విపత్తు మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. ఇప్పటివరకు 1,600 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది.
కష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ఆపరేషన్ బ్రహ్మ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతేకాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ ఆంటోనియో-గుటెరస్ తెలిపారు.