Black Box | హోబర్ట్ (ఆస్ట్రేలియా), ఏప్రిల్ 1: వాతావరణ మార్పుల వల్ల భూగోళంపై మానవాళి అంతరించిపోతే ఆ తర్వాతి తరాలవారికి లేదా ఏదైనా గ్రహం నుంచి భూమిపైకి వచ్చినవారికి ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సమాధానం చెప్తున్నారు. భూగోళం కోసం వారు ఓ బ్లాక్‌బాక్స్‌ను నిర్మిస్తున్నారు. 32 అడుగుల పొడవైన ఈ ఉక్కు స్థూపం వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలను నిరంతరం రికార్డు చేసి, భద్రపరిచేందుకు అవసరమైన హార్డ్‌డ్రైవ్‌లను కలిగి ఉంటుంది. భూగోళ మరణానికి దారితీసిన సంఘటనల గురించి ఈ బ్లాక్‌బాక్స్ తెలియజేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ఏదైనా పెను విపత్తు సంభవిస్తే దాన్ని నివారించడంలో మానవాళి ఎలా విఫలమైందో వివరిస్తూ ఓ నిస్పాక్షిక డాక్యుమెంట్‌ను అందిస్తుంది. ఈ బ్లాక్‌బాక్స్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నంత వరకు లేదా దాన్ని యాక్సిస్ చేయగలిగినంత వరకు ఆ డాక్యుమెంట్‌ను అందిపుచ్చుకోవచ్చు.
స్టాన్లీ కుబ్రిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘2001: ఏ స్పేస్ ఒడిస్సీ’లోని మిస్టీరియస్ మోనోలిత్కు సమానమైన ప్రకాశాన్ని ఈ బ్లాక్‌బాక్స్ కలిగి ఉంటుందని కళాకారులు చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా సహకారంతో ఆస్ట్రేలియన్ మార్కెటింగ్ సంస్థ క్లెమెంజర్ బీబీడీవో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నది. వాస్తవానికి ఈ బ్లాక్‌బాక్స్ నిర్మాణం గురించి 2021 డిసెంబర్లోనే ప్రకటించారు. 2022 లోనే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్‌బాక్స్ నిర్మాణాన్ని ఈ ఏడాది మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలోనే పూర్తి చేయనున్నట్టు ఈ ప్రాజెక్టు చైర్పర్సన్, క్లెమెంజర్ బీబీడీవో ప్రొడక్షన్ హెడ్ సోనియా వాన్ బిబ్రా తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ సంబంధిత దరఖాస్తును ఆస్ట్రేలియా పన్నుల శాఖ ఆమోదించాల్సి ఉన్నదని ఆమె వివరించారు. ఈ బ్లాక్‌బాక్స్‌ను నెలకొల్పే కచ్చితమైన ప్రాంతం ఏదో ఇప్పటికీ వెల్లడి కాకపోయినప్పటికీ ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి సమీపాన స్ట్రాహన్-క్వీన్స్టౌన్కు మధ్యలో దీన్ని ఏర్పాటు చేయవచ్చని తెలుస్తున్నది.