Yahya Sinwar | ఇజ్రాయెల్‌తో పోరులో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో సంస్థ చీఫ్ (Hamas Chief) యహ్యా సిన్వార్ (Yahya Sinwar) మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. గాజాలోని రఫా పట్టణంపై ఐడీఎఫ్ ఈ నెల 7న చేసిన దాడిలో సిన్వార్ హతమైనట్టు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి కట్జ్ గురువారం నిర్ధారించారు. కాగా, చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.
ఓ శిథిల భవనంలోని సోఫాలో సిన్వార్ కూర్చుని ఉన్న దృశ్యాలను ఇజ్రాయెల్ డ్రోన్ చిత్రీకరించింది. డ్రోన్‌ను గమనించిన సిన్వార్.. దానిపై కర్ర విసిరాడు. ఈ వీడియోను ఐడీఎఫ్ (Israel Defense Forces) అంతర్జాతీయ అధికార ప్రతినిధి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. శిథిలమైన ఆ భవనంలోపల హమాస్ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా..? అని తెలుసుకునేందుకు డ్రోన్‌ను పంపినట్లు తెలిపారు. తొలుత ఆ వ్యక్తిని మిలిటెంట్ అనుకున్నట్లు చెప్పారు. ఆ భవనంపై బాంబు దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో అతను మృతి చెందగా.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వర్ అని తెలిసిందని సదరు అధికారి వివరించారు. సిన్వర్ శరీరంపై బుల్లెట్ ఫ్రూప్ జాకెట్, గ్రనేడ్స్ ఉన్నట్లు వెల్లడించారు.
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024
మరోవైపు సిన్వర్ మృతిపై హమాస్ ఇప్పటి వరకూ స్పందించలేదు. ‘ఏడాది క్రితం అక్టోబర్ 7న యహ్యా సిన్వార్ నేతృత్వంలో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భయంకర ఊచకోతలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు కన్నుమూశారు. వారిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఒక ఏడాది తర్వాత సిన్వార్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. న్యాయం జరిగింది. ఇజ్రాయెల్ వాసులకు హాని కలిగించే ఏ ఉగ్రవాది అయినా శిక్ష అనుభవించాల్సిందే’ అని ఇజ్రాయెల్ అధికారిక సందేశాన్ని పోస్ట్ చేసింది.
ఎప్పుడు జరిగింది?
ఇజ్రాయెల్ పదాతి దళాలు దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫా నగరంలో ఈ నెల 7న ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు ఉగ్రవాదులను చంపాయి. తర్వాత ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఒకరి మృత దేహం సిన్వార్దిగా అనుమానం రావడంతో ఆ మృత దేహానికి డీఎన్ఏ పరీక్షలు చేస్తామని, గతంలో సిన్వార్ ఇజ్రాయెల్ జైలులో ఉన్నప్పుడు అతని నుంచి తీసిన డీఎన్ఏ శాంపిల్స్‌తో దీనిని పోలుస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో ప్రకటించింది. అయితే తర్వాత ఆ మృతదేహం అతడిదే అని డీఎన్ఏ పరీక్షతో నిర్ధారణ అయ్యింది.
అక్టోబర్ 7 దాడులకు సూత్రధారి
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో సిన్వార్ ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ వాంటెడ్ లిస్టులో ఉన్న సిన్వార్ జాడను కనిపెట్టడం ఇజ్రాయెల్‌కు కష్టతరంగా మారింది. గాజాలో నిర్మించిన సొరంగాల్లో ఆయన ఎక్కువగా ఉండేవారు. ఇదే క్రమంలో అప్పటివరకు హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉండగా, ఆగస్టులో ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ఆయన స్థానాన్ని సిన్వార్ స్వీకరించారు.
ఎవరీ సిన్వార్?
1962లో జన్మించిన సిన్వార్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ ఆందోళనల్లో పాల్గొనడంతో ఇజ్రాయెల్ 1980లో అరెస్ట్ చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్‌పై పోరాటానికి ఆయుధాల ప్రయోగంలో శిక్షణ పొందిన వారిని నియమించి ఒక సంస్థను స్ధాపించాడు. కాసమ్ బ్రిగేడ్స్‌గా పేరొందిన ఆ గ్రూప్ తర్వాత హమాస్ మిలటరీ వింగ్‌గా మారింది. అనంతరం అతడిని అరెస్ట్ చేసిన ఇజ్రాయెల్ 426 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 23 ఏండ్లు అతను ఇజ్రాయెల్ జైలులో గడిపాడు. 2011లో ఖైదీల ఒప్పందంతో విడుదలయ్యాడు. 2014లో హమాస్‌లో ప్రధాన నేతగా ఎదిగాడు. గత ఏడాది అక్టోబర్ 7 దాడిలో ప్రధాన పాత్ర పోషించాడు.
Also Read..
Salman Khan | ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి.. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు
They Call Him OG | పవన్ కల్యాణ్ షూట్ లొకేషన్.. ఓజీ బాయ్స్ ఫైర్ మోడ్
KTR | పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కేటీఆర్