Drone attacks : ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ మిలిటెంట్ గ్రూప్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని తమ గడ్డపై, తమ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ హత్య చేయడంపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఏ క్షణానైనా ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు సిద్ధమవుతోంది.
దాంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలావుంటే ఇప్పటికే ఇరాన్ మద్దతు కలిగివున్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా.. ఇజ్రాయిల్‌పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేస్తోంది.
ఇటీవల ఇజ్రాయిల్ వైమానిక దాడిలో లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ మరణించాడు. దాంతో హిజ్బుల్లా ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తోంది. అయితే లెబానాన్ నుంచి వస్తున్న శత్రువుల డ్రోన్లను ఇజ్రాయెల్ సమర్థంగా అడ్డుకుంది.
ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఎకర్ సమీపంలో రెండు మిలిటరీ సైట్లపై డ్రోన్ దాడులు చేశామని, మరో ప్రదేశంలో ఇజ్రాయెల్ సైనిక వాహనంపై కూడా దాడి చేశామని హిజ్బుల్లా తెలిపింది. ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్ నుంచి వస్తున్న అనేక డ్రోన్లను గుర్తించి వాటిని అడ్డగించినట్లు పేర్కొంది.