బీజింగ్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా రాజధాని బీజింగ్ నగరంలో బుధవారం సెమీ లాక్డౌన్ విధించింది. డజన్ల కొద్దీ సబ్ వే స్టేషన్లతో పాటు పాఠశాలలు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలను మూసివేసింది. బీజింగ్‌లో బుధవారం 51 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు జాగ్రత్తగా చైనా రాజధాని నగరంలో కరోనా నిరోధానికి కఠిన చర్యలకు ఉపక్రమించింది. పాఠశాలల పునః ప్రారంభాన్ని మరో వారంపాటు వాయిదా వేయగా.. నగరంలో బుధవారం సుమారు 60 సబ్వే స్టేషన్లు, 158 బస్సు మార్గాలను మూసివేసింది.
ఆయా స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ను మూసివేయబడుతాయని అధికారులు పేర్కొన్నారు. సస్పెండ్ చేసిన స్టేషన్లలో ఎక్కువ భాగంగా చాయాంగ్ జిల్లాలోనే ఉండగా.. ఈ నగరంలో అనేక మంది అగ్ర నేతలు, దౌత్యపరమైన ఎన్‌క్లేవ్‌లో ఉన్నాయి. మరో వైపు విమానం, రైలు ద్వారా బీజింగ్‌కు వచ్చే వారంతా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదంటే గ్రీన్ హెల్త్ కోడ్‌ను సమర్పించాలని ఆదేశించారు. గ్రీన్ హెల్త్ కోడ్‌ను అందించకపోతే బీజింగ్‌లో ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.
మరో వైపు నాలుగు రోజుల మేడే సెలవులు నేటితో ముగియనుండడంతో నగరం నిర్మానుష్యంగా కనిపించింది. ఇదిలా ఉండగా.. షాంఘైలో కొవిడ్ కేసుల తగ్గింది. ఇప్పటికే నగరం నెలకుపైగా లాక్‌డౌన్‌లోనే ఉన్నది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, నగరంలో బుధవారం 4,982 కొత్త కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌తో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాథమిక అవసరాలకు సైతం ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొంది.