న్యూఢిల్లీ, జనవరి 21: దావోస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలన్న తన ఆకాంక్షను బుధవారం బలంగా మరోసారి బయటపెట్టుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ప్రసంగిస్తూ గ్రీన్‌లాండ్‌ని అమెరికా భూభాగంగా అభివర్ణించిన ట్రంప్ దాన్ని స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేయబోమంటూ భరోసా ఇచ్చారు. అదే స్వరంతో తన కోరికను వ్యతిరేకిస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీచేశారు. మీరు సరేనంటే సంతోషిస్తాను. మీరు కాదంటే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను అంటూ ట్రంప్ హెచ్చరించారు. ఎందరో వ్యాపార దిగ్గజాలు, ఎందరో మిత్రులు, మరి కొందరు శత్రువులతో కలసి అందమైన దావోస్‌లో ఉండడం ఎంతో సంతోషంగా ఉందంటూ వ్యంగ్యాస్ర్తాలతో తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు. తన పాలనలో అమెరికా సాధిస్తున్న అభివృద్ధిని గొప్పగా చెప్పుకున్న ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో తనకు మద్దతు ఇవ్వని యూరప్ సరైన దిశలో నడవడం లేదంటూ విమర్శించారు. గ్రీన్లాండ్ పెద్ద, అందమైన మంచు తునకగా అభివర్ణించారు. గ్రీన్‌లాండ్‌ని అమెరికా తప్ప మరెవరూ రక్షించలేరని ఆయన పునరుద్ఘాటించారు.
డెన్మార్క్‌కు అప్పగించడం మూర్ఖత్వం
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ని డెన్మార్క్‌కు అప్పగించడం తమ మూర్ఖత్వంగా పేర్కొన్న ట్రంప్ ఇందుకు బదులుగా కృతజ్ఞత లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్, డెన్మార్క్ ప్రజల పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని ట్రంప్ తెలిపారు. అమెరికా తప్ప మరే దేశమూ లేదా దేశాల కూటమో గ్రీన్‌లాండ్‌ని పొందలేవని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశం అత్యంత శక్తివంతమైనదని, ప్రజలు అర్థం చేసుకునే దాని కన్నా చాలా గొప్ప దేశమని ట్రంప్ చెప్పారు. ఇందుకు ఉదాహరణగా ఈ నెల మొదట్లో వెనెజువెలా నాయకుడు నికోలస్ మదురోను బంధించడాన్ని ఆయన గుర్తుచేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో ఆరు గంటల్లో డెన్మార్క్ జర్మనీ వశమైపోయిందని, అప్పుడు అమెరికా డెన్మార్క్‌కు అండగా నిలిచిందని ట్రంప్ చెప్పారు. గ్రీన్లాండ్ భూభాగాన్ని కాపాడేందుకు తమ సొంత దళాలను పంపించడం తమ కర్తవ్యంగా భావించామని, అందుకు భారీ వ్యయాన్ని భరించామని ట్రంప్ చెప్పారు. డెన్మార్క్ కోసం గ్రీన్లాండ్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేశామని, డెన్మార్క్ కోసం తాము పోరాడామని ఆయన తెలిపారు. గ్రీన్‌లాండ్‌ని రక్షించి తమ అర్ధభూగోళంలో శత్రువులు అడుగుపెట్టకుండా అడ్డుకున్నామని ట్రంప్ చెప్పారు. ఇది తమకోసం కూడా చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ యుద్ధంలో అమెరికా ఘన విజయం సాధించిందని, తాము లేకుంటే ఇప్పుడు మీరంతా జర్మన్లోనో, వచ్చీరాని జపనీస్ భాషలోనో మాట్లాడుతుండే వారని ట్రంప్ వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ని అమెరికా డెన్మార్క్‌కు ఇచ్చిందని, అలాంటి పని చేయడం ఎంత మూర్ఖత్వమని ఆయన ప్రశ్నించారు. కాని ఇప్పుడు డెన్మార్క్‌కు తమ పట్ల కృతజ్ఞత లేకుండా పోయిందని ట్రంప్ విమర్శించారు.
చర్చలకు సిద్ధం
గ్రీన్‌లాండ్‌పై వెంటనే సంప్రదింపులు జరగాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తమ చరిత్రలో ఎన్నో దేశాలను స్వాధీనం చేసుకున్నట్లే గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవడంపై మరోసారి చర్చలు జరగాలని ట్రంప్ చెప్పారు. యూరోపియన్ దేశాలు కూడా ఆ పని చేశాయని, అందులో తప్పేమీ లేదని ఆయన అన్నారు. కాని దీని వల్ల నాటోకు ఎటువంటి ముప్పు లేదని, పైపెచ్చు ఇది నాటో భద్రతను మరింత బలోపేతం చేస్తుందని ఆయన చెప్పారు.
యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందం నిలిపివేత
అమెరికా-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపి ఉంచాలని నిర్ణయించినట్లు యూరోపియన్ పార్లమెంట్‌కు చెందిన ట్రేడ్ కమిటీ చీఫ్ బెర్న్డ్ లాంగే ప్రకటించారు. ఇది ఇప్పుడు అధికారిక ప్రకటన అని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టర్న్బెర్రీ డీల్ చట్టబద్ధ అమలుపై యూరోపియన్ పార్లమెంటు కృషిని నిలిపివేయాలని ఇప్పుడే తమ చర్చల బృందం నిర్ణయించిందన్నారు. తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత ప్రమాదంలో పడినట్లు తెలిపారు. యథాప్రకారంగా వ్యాపారాన్ని కొనసాగించడం ఇక అసాధ్యమని పేర్కొన్నారు. అమెరికా విధిస్తున్న టారిఫ్స్, డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు.