Donald Trump | అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వెనిజులా తీరంలో భారీ చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ట్యాంకర్లలో ఇదే అతిపెద్దదని ఆయన పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా యూఎస్ ఈ చర్యలు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. నేవీ మద్దతుతో యూఎస్ కోస్ట్‌గార్డ్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ స్వాధీనానికి ఒక రోజు ముందు యూఎస్ దళాలు వెనిజులా గల్ఫ్ మీదుగా ఫైటర్ జెట్స్‌ను తిప్పింది. ఇటీవల యూఎస్ జెట్లు అంత దగ్గరగా వెళ్లడం ఇదేనని సమాచారం. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని పెంచుకుంటూ వస్తున్నది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై అనేక దాడులను యూఎస్ చేపట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవడం చూడొచ్చని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే భూతల దాడులు జరగవచ్చన్నారు. అయితే, ఎప్పుడు.. ఎక్కడ దాడులు నిర్వహిస్తారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇటీవల చర్చల సందర్భంగా చమురు కంపెనీ చెవ్రాన్పై వెనిజులాలో చమురు ఉత్పత్తి, ఎగుమతులను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. ఇది మదురో ప్రభుత్వానికి ఆర్థికంగా ఊరట కలిగించింది.
మరో వైపు ట్రంప్ బుధవారం ట్రంప్ గోల్డ్ కార్డ్‌పై కీలక ప్రకటన చేశారు. వెబ్సైట్ కొద్ది నిమిషాల్లోనే అందుబాటులోకి వస్తుందని.. కార్డ్ ద్వారా సేకరించిన సొత్తు అంతా అమెరికా ప్రభుత్వానికి వెళ్తుందన్నారు. ఇది గ్రీన్ కార్డ్ లాంటిదేనని.. దాంతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ కార్డు ద్వారా ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులు, నిపుణులను అమెరికన్ కంపెనీలు నిలుపుకోగలవన్నారు. భారత్, చైనా, ఫ్రాన్స్ నుంచి వెళ్లే ప్రతిభావంతులైన వ్యక్తులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఉండగా.. గోల్డ్‌కార్డ్ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని పేర్కొంటున్నారు. బడా కంపెనీలు.. ముఖ్యంగా ఆపిల్ చాలాకాలంగా ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. గోల్డ్ కార్డ్ కంపెనీలు అర్హత కలిగిన వ్యక్తులను నియమించుకోవడానికి సహాయపడడంతో పాటు ప్రభుత్వానికి బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని తీసుకువస్తుందని.. ఇదంతా నేరుగా యూఎస్ ఖజానాకు వెళ్తుందన్నారు.