న్యూఢిల్లీ/ స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో గడిచిన 25 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయమై ఇరాన్‌తో గడిచిన రెండు రోజులుగా ఫలప్రదమైన చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్‌లోని విద్యుత్తు కేంద్రాలతో పాటు ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు రోజుల వరకూ ఎలాంటి దాడులు చేయవద్దని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు ఇలాగే కొనసాగుతాయని, చర్చల ఫలితాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. అయితే, తమతో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్ భయపడిపోయి వెనక్కి తగ్గినట్టు పేర్కొన్నది.
తమ విద్యుత్తు ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకొంటే, అదేరీతిన ప్రతిదాడులు చేయడంతో పాటు హొర్ముజ్ జలసంధిని కూడా పూర్తిగా మూసివేస్తామన్న తమ హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే దాడులకు ఐదురోజులు విరమణ ప్రకటించినట్టు పేర్కొన్నది. ఇదిలాఉండగా.. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 13 శాతం మేర (17 డాలర్లు) క్షీణించి 96 డాలర్లకు చేరింది.
ఇరాన్ స్పందనకు ట్రంప్ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తహతహలాడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రతినిధులు ఇరాన్‌కు చెందిన ఓ గౌరవప్రదమైన నేతతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరితే.. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకొనే దిశగా చర్యలు తీసుకొంటామన్నారు. అయితే, ఇరాన్‌కు చెందిన ఆ గౌరవప్రదమైన నేత ఎవరన్న విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు.
దాడులకు 5 రోజుల విరమణను ఇస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్ కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్ మీదికి మరో దఫా దాడులను జరిపింది. దీంతో ట్రంప్ వైఖరి నచ్చకనే ఇజ్రాయెల్ దళాలు ఈ చర్యలకు పాల్పడినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ట్రంప్ ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరుపడాన్ని యూఎస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ సెంటర్ మాజీ డైరెక్టర్ జో కెంట్ తప్పుబట్టారు. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.
యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు గత శనివారం ప్రకటించిన ట్రంప్.. ఆ మరునాడే ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. హొర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరువకపోతే ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. అయితే, ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్ మిలిటరీ కూడా ఘాటుగా ప్రతిస్పందించింది. ట్రంప్ తమ విద్యుత్తు ప్లాంట్లపై దాడి చేస్తే పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికాకు చెందిన అన్ని ఇంధన, సాంకేతిక, ఉప్పునీటి శుద్ధి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తాము కూడా దాడి చేస్తామని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఖైతమ్ అల్-అన్బియా తెలిపింది. అలాగే హొర్ముజ్‌ను పూర్తిగా మూసివేస్తామని, ప్లాంట్లను తిరిగి నిర్మించేంత వరకు దాన్ని మళ్లీ తెరువబోమని హెచ్చరించింది. అయితే, ఇరాన్ నుంచి ఈ రీతిన సమాధానం వస్తుందని ఊహించని ట్రంప్ ప్రత్యామ్నాయ చర్యలకు దిగినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే 48 గంటల డెడ్‌లైన్ గడువు ముగియక ముందే, తాత్కాలిక దాడుల విరమణపై ప్రకటన చేసినట్టు సమాచారం.
ఇరాన్ శక్తి, సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిన ట్రంప్.. ఇప్పుడు మూల్యం చెల్లించుకొంటున్నారని అమెరికా మాజీ రక్షణమంత్రి, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మాజీ చీఫ్ లియోన్ పనెట్టా విమర్శించారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ట్రంప్‌నే సృష్టించారని పనెట్టా ఆరోపించారు. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచంలో ఇంధన సంక్షోభం తలెత్తుతుందన్న విషయం ట్రంప్‌నకు తెలుసునని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ ప్రమాదాన్ని ఆయన విస్మరించినట్టు మండిపడ్డారు. ఇరాన్‌తో యుద్ధం ఎంతకాలం కొనసాగితే, ట్రంప్‌నకు అన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ఇరాన్ యుద్ధాన్ని అర్ధంతరంగా ముగించినా.. కొనసాగించినా ట్రంప్‌నకు పెద్ద చిక్కేనని పనెట్టా విశ్లేషించారు. యుద్ధం నుంచి వెనక్కి వస్తే వైఫల్యమని, ముందుకు వెళ్తే సంక్షోభ తీవ్రతను మరింత పెంచారని ట్రంప్ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మిత్ర దేశాలతో చర్చించకుండా యుద్ధానికి వెళ్లడంతో ట్రంప్ ఒంటరిగా మారారని తెలిపారు.
ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్ పెద్ద పొరపాటు చేశారా? అనే ప్రశ్నలు ఇప్పుడు పెరుగుతున్నాయి. అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ గత నెల 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు తెగబడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలిరోజునే హతమార్చాయి. దీంతో ఇరాన్ తమ దారికొస్తుందని ట్రంప్ అనుకొన్నారు. అయితే, ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులకు దీటుగా బదులిస్తూనే.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, విద్యుత్తు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. అంతేకాకుండా.. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధిని మూసివేస్తూ ప్రపంచ దేశాలకు ఇంధన సెగ తగిలించి.. పశ్చిమాసియా సంక్షోభాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసింది. దీంతో ట్రంప్ వైఖరిపై అటు గల్ఫ్ దేశాలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు మండిపడ్డాయి.
హొర్ముజ్ జలసంధిలో నౌకల రవాణా భద్రతతో పాటు అమెరికాకు సాయం అందించడానికి నాటో దేశాలు కూడా ముందుకు రాలేదు. చమురు సరఫరా లేకపోవడంతో అగ్రరాజ్యంలో పెట్రోల్ ధరలు మూడేండ్ల గరిష్ఠానికి చేరాయి. ఫలితంగా ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని అమెరికన్లు కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. పశ్చిమాసియాలో బలగాల మోహరింపునకు సిద్ధంగా లేనట్టు అమెరికా మిలిటరీ కమాండర్లు కూడా ప్రకటించారు. ఇదిలా కొనసాగుతుండగానే.. హొర్ముజ్‌లో సీమైన్లను భారీగా మోహరిస్తూ నౌకల రవాణాను అడ్డుకోవడంలో ఇరాన్ మరింత దూకుడు పెంచింది.
ఇది గమనించిన ట్రంప్ శనివారం ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. దీనికి ఇరాన్ కౌంటర్ ఇవ్వడంతో ఏం చెయ్యాలో ట్రంప్‌నకు పాలుపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకానొక దశలో ఈ ఇరాన్ యుద్ధంలో తాను ఒంటరయ్యానా? అని ట్రంప్ భావించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ దాడులకు ఐదు రోజులపాటు బ్రేక్ ఇస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారని అంటున్నారు. మొత్తంగా ఇరాన్ విషయంలో ట్రంప్ పీఛేముడ్ అన్నారని అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బఘర్ ఘలిబాఫ్ తోసిపుచ్చారు. ఫైనాన్షియల్, ఆయిల్ మార్కెట్లను మ్యానిపులేట్ చేసేందుకు ట్రంప్ ఫేక్ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరుపలేదన్నారు. శత్రువులకు కఠిన శిక్ష విధించాలని ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.