Donald Trump | మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తనకున్న అధికారాలతో కుమారుడు హంటర్ బైడెన్ (Hunter Biden)కు భారీ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. తుపాకీ కొనుగోలు, పన్ను ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై దోషిగా తేలిన తన కుమారుడు హంటర్‌కు బైడెన్ (Hunter Biden) క్షమాభిక్ష (Pardoning) ప్రసాదించారు. బైడెన్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమని, బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్రంగా మండిపడ్డారు.
ఈ మేరకు తన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. ‘హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జే-6 బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదు..? కుమారుడి విషయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా న్యాయవిరుద్ధం, అధికార దుర్వినియోగం’ అని ట్రంప్ పోస్ట్ పెట్టారు. జే-6 బందీలు అంటే 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్‌లో ట్రంప్ తరఫున అల్లర్లలో పాల్గొన్నవారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైన సమయంలో ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో 140 మందికిపైగా పోలీసు అధికారులు గాయపడ్డారు.
కాగా, అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్, కాలిఫోర్నియాలో హంటర్ బైడెన్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే, ఇప్పటి వరకూ శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో బైడెన్ స్పందిస్తూ.. హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకున్నారు. బైడెన్ నిర్ణయం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Joe Biden | అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు.. కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష
Ludo | మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు ఏం చేశాడో చూడండి.. వైరల్ పిక్
Sabarmati Report | పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ది సబర్మతి రిపోర్ట్ స్క్రీనింగ్.. వీక్షించనున్న మోదీ