న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6/ (స్పెషల్ టాస్క్ బ్యూరో): ‘నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించే’ తరహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కొనసాగుతున్నది. భారత్ తన మిత్ర దేశమని, ప్రధాని మోదీ గొప్ప ప్రధాని అని ఒక పక్క వ్యంగ్యంగా పొగుడుతూనే మరోవైపు భారత్‌పై కక్ష సాధింపు, ప్రతీకార చర్యలను ట్రంప్ కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికన్ కంపెనీలు భారత ఐటీ సంస్థలకు ఇచ్చే కాంట్రాక్టులను నిలిపివేసే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నారని ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ తెలపడమే ఇందుకు నిదర్శనం. ఈ నిర్ణయం అమలైతే భారత ఐటీ రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఐటీ రంగం అమెరికన్ సంస్థల నుంచి వచ్చే కాంట్రాక్టులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.
ఈ చర్య వల్ల భారతదేశంలో సాంకేతిక, సపోర్ట్, బ్యాక్ఎండ్ రంగాల ఉద్యోగులకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ‘అమెరికన్ ఐటీ కంపెనీలు తమ పనులను భారతీయ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ చేయకుండా నిలిపివేయడం గురించి అధ్యక్షుడు ట్రంప్ ఆలోచిస్తున్నారు’ అని లూమర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేసినప్పుడు ఇంగ్లిష్ కోసం నంబర్ ప్రెస్ చేయాల్సిన అవసరం అమెరికన్లకు ఇకపై ఉండకపోవచ్చని లూమర్ పేర్కొన్నారు.
వేరే మాటల్లో చెప్పాలంటే, ‘మీరు ఇంగ్లిష్ కోసం 2 నొక్కాల్సిన అవసరం లేదు’ అని రాసుకొచ్చారు. కాల్ సెంటర్లను మళ్లీ అమెరికావిగా చేద్దాం! అని పిలుపునిచ్చారు. ఇటీవల అమెరికన్ కార్యకర్త జాక్ పోసోబిక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విదేశీ రిమోట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్‌పై పన్నులు విధించాలని సూచించారు. వస్తువుల మాదిరిగానే, సేవలను కూడా రిమోట్‌గా అమెరికాకు అందించడానికి దేశాలు రుసుము చెల్లించాలి. ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలకు వర్తింపజేయాలి అని ఆయన పేర్కొన్నారు.
మరోపక్క ట్రంప్ సలహాదారులు తమ ప్రకటనలతో భారత్‌పై విషం కక్కుతూనే ఉన్నారు. రెండు నెలల్లో ట్రంప్‌నకు భారత్ క్షమాపణ చెప్పి కాళ్లబేరానికి రావడం ఖాయమంటూ దిగజారుడు ప్రకటనలు చేస్తూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు పొగుడుతూనే మరోవైపు సుంకాల బాదుడు వంటి కఠిన నిర్ణయాలతో దేనిదారి దానిదే అన్నట్టుగా ట్రంప్ ద్వంద్వ వైఖరితో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, వ్యంగ్యంగా చేసిన ట్రంప్ ప్రకటనలను కూడా పొగడ్తలుగా మార్చి అదేదో తమ గొప్పగా చెప్పుకొనేందుకు మోదీ పరివారం ఆరాడపడుతున్నది.
ట్రంప్‌తో మోదీకి బలమైన సంబంధాలు ఉన్నాయని, అమెరికాతో భాగస్వామ్యానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించడం ఇందుకు ఉదాహరణ. మొత్తంగా ట్రంప్ పొగడ్తలకు మురిసిపోతే.. భారత్ మునుగుడే అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. భారత్‌పై ట్రంప్ మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించకముందే దౌత్యపరమైన పరిష్కారాలను మోదీ ప్రభుత్వం వెదుకాల్సిన అవసరాన్ని నిపుణులు ఈ సందర్భంగా నొక్కి చెప్తున్నారు.
భారత్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీని గొప్ప ప్రధానిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అయితే మోదీ చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదన్నారు. ఈ మేరకు తన ఓవల్ ఆఫీసులో శుక్రవారం విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. ‘నరేంద్ర మోదీ నాకు ఎప్పటికీ మంచి మిత్రుడే. ఆయన గొప్ప ప్రధాని. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు నాకు నచ్చడం లేదు. ఏదేమైనా భారత్, అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. దాన్ని గురించి ఆందోళన అనవసరం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి’ అన్నారు. మరోవైపు, భారత్‌పై ట్రంప్ సన్నిహితులు విషాన్ని కక్కుతూనే ఉన్నారు.
వైట్‌హౌస్ సీనియర్ సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌పై ఆరోపణలు గుప్పించారు. రష్యా చమురు ద్వారా లాభాలు గడిస్తున్న భారత్.. తమపై సుంకాలు విధిస్తూ అమెరికన్ల ఉద్యోగాలను నష్టపరుస్తోందని ఆయన ఆరోపించారు. లాభాల కోసమే భారత్ రష్యన్ చమురును కొనుగోలు చేస్తోందని, ఈ ఆదాయంతోనే రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తోందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ వెంటనే నిలిపివేయాలని, బ్రిక్స్‌ను విడిచిపెట్టాలని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హూవార్డ్ లుట్నిక్ మరోసారి హెచ్చరించారు. సుంకాల విషయంలో భారతదేశం చివరికి అమెరికాకు లొంగిపోతుందని, వ్యాపార నష్టాలు భారత్ తమతో ఒప్పందం కుదుర్చుకునేలా చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మోదీతో చాలా మంచి సంబంధం ఉంది. కానీ ఇప్పుడు అది పోయింది’ అని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాస్ బోల్టస్ అన్నారు.
భారత్ వంటి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల వివాదంపై అమెరికా సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌లలో చాలా వరకు అమెరికాలోని దిగువ కోర్టు రద్దు చేసింది. దీంతో అమెరికన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రశ్నించినపుడు అభిజిత్ బెనర్జీ స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఎంతో చేస్తుందని తాను విశ్వసించడం లేదన్నారు. ఎగ్జిక్యూటివ్(కార్యనిర్వాహక వర్గం) చర్యలను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. ఎగ్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాలను పరిరక్షించడంవైపే మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. ట్రంప్ తాను అనుకున్నదానిని చేయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయన్నారు.
మోదీపై ట్రంప్ పొగడ్తలు కురిపించినప్పటికీ, అది దౌత్యపరమైన వ్యూహాత్మక ప్రకటనే తప్ప అగ్రరాజ్యాధినేత మనస్సు నుంచి వచ్చింది కాదని, ఒకవిధంగా అవి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలని నిపుణులు అంటున్నారు. ట్రంప్ గనుక మనస్ఫూర్తిగా ఆ మాటలు అని ఉంటే భారత్‌పై విధించిన భారీ సుంకాలు ఎత్తేయగలరా? అని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్‌నకు ప్రస్తుతం భారత్‌పై సుంకాలు తగ్గించే ఉద్దేశం ఎంతమాత్రం లేదని, అలా చేస్తే ఇంతకాలం భారత్‌పై హూంకరించిన ఆ దేశం ప్రపంచ దేశాల మధ్య నవ్వుల పాలవుతుందని అంటున్నారు.
భారత్ పూర్తిగా చైనా, రష్యా కూటమివైపు వెళ్లిపోకుండా అదుపు చేసేందుకే ట్రంప్ తాజాగా ఈ బుజ్జగింపు ప్రకటన చేశారని, ఆ ప్రకటనను ఆధారంగా చేసుకుని భారత్‌పై విధించిన సుంకాలు తగ్గిస్తారనుకోవడం భ్రమేనని అంటున్నారు. అయితే, ట్రంప్ వ్యంగ్య ప్రకటనలను గొప్పగా చెప్పుకోవడం మానేసి, దౌత్యపరమైన పరిష్కారాలకు మోదీ ప్రభుత్వం యోచించాల్సిన అవసరం ఉన్నదని సలహా ఇస్తున్నారు. అలాగైతేనే, ప్రవాసీ భారతీయులతో పాటు స్వదేశీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు భద్రత ఉంటుందని గుర్తు చేస్తున్నారు.