వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెర లేపారు. ఏసు క్రీస్తు గెటప్‌లో ఉన్న ఏఐ ఇమేజ్ను ఆయన తన ట్రుత్ సోషల్‌లో షేర్ చేశారు. ఇరాన్ వార్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిపై క్రైస్తవుల మతపెద్ద పోప్ లియో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏసు క్రీస్తు ఫోజులో ఉన్న ఓ ఫోటోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్రీస్తు వేషధారణలో ఉన్న ట్రంప్.. ఓ వ్యక్తికి స్వాంతన చేకూర్చుతున్నట్లు ఆ పిక్‌లో ఉన్నది. ఇక తానేమీ పోప్ లియోకు అభిమానిని కాదు అని ట్రంప్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడి చేసిన నాటి నుంచి కృత్రిమ మేధతో సృష్టించిన ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో తెగ షేర్ అవుతున్న విషయం తెలిసిందే.
ట్రంప్ చేసిన క్రీస్తు ఫోటో పోస్టుపై ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి. కొందరు నవ్వుకోగా, మరికొందరు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై మత సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. క్రీస్తులా ఉన్న ట్రంప్ ఫోటో సరిగా లేదని, క్రీస్తును అవమానిస్తున్నట్లు ఉందని కొందరన్నారు. పవిత్రమైన క్రీస్తును రాజకీయాలు, వ్యక్తిగత బ్రాండింగ్ కోసం వాడుకోవడం అభ్యంతరకంగా ఉన్నట్లు కొందరు పేర్కొన్నారు. ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఆ పిక్‌ను సమర్ధించారు. నవ్వుకోవడానికి ఆ ఇమేజ్ పోస్టు చేసినట్లు చెప్పారు. అదో డిజిటల్ సెటైర్ అని కొందరన్నారు. ఈ ప్రపంచ రక్షకుడు, మెసయ్య ఆయనే అని కొందరన్నారు.