వాషింగ్టన్, జనవరి 7: పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘సర్.. ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా’ అంటూ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని చెబుతూనే ఆయనను కించపరిచే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అపాచీ హెలికాప్టర్ల సరఫరాతోసహా పెండింగ్లో ఉన్న రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలను చర్చించేందుకు భారత ప్రధాని మోదీ తనను వ్యక్తిగతంగా కలుసుకున్నారని ట్రంప్ మంగళవారం తెలిపారు.
ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ తనకు, మోదీకి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం భారత్ అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఐదేండ్లు గడిచినా భారత్కు ఆ హెలికాప్టర్లు అందలేదు. ప్రధాని మోదీ నన్ను కలిసేందుకు వచ్చారు. సర్.. మిమ్మల్ని కలవొచ్చా ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డారు. సరే కలుద్దామని చెప్పాను. మోదీతో నాకు మంచి అనుబంధం ఉంది అని ట్రంప్ వివరించారు. అయితే సుంకాలకు సంబంధించి మోదీ తన పట్ల సంతోషంగా లేరని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. భారీ సుంకాలు చెల్లిస్తున్న కారణంగా మోదీ తన పట్ల సంతోషంగా లేరని ఆయన చెప్పారు. పైగా భారత్ తమ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదని కూడా ఆయన తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ గణనీయంగా తగ్గించినప్పటికీ ఇంకా చాలా తగ్గించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సుంకాల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎంత బలోపేతం చేసిందో కూడా ఆయన ప్రస్తావించారు. సుంకాల వల్ల మనం చాలా సంపన్నులయ్యామని, ఇప్పటికే అందరికీ ఆ విషయం అర్థమై ఉంటుందని ట్రంప్ చెప్పారు. 65,000 కోట్ల డాలర్ల మేరకు సుంకాల ద్వారా అమెరికాలోకి సంపద చేరుతోందని ఆయన చెప్పారు. అపాచీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ వాటి కోసం భారత్ ఐదేండ్లుగా ఎదురుచూస్తున్నదని, త్వరలోనే ఈ ఒప్పందం ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. భారత్ 68 అపాచీ హెలికాప్టర్లు కొనుగోలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
సుంకాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తనను ప్రాధేయపడిన తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకరిస్తూ ఎద్దేవా చేశారు. అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని ఫ్రెంచ్ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని బెదిరించి మందుల ధరలను పెంచేలా ఫ్రాన్స్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. “డొనాల్డ్.. మా ప్రిస్క్రిప్షన్ మందుల ధరలను 200 శాతం లేదా అంతకుమించి పెంచడానికి మేము సిద్ధం.
మీరు చెప్పినట్లే చేస్తాను. కాని దయచేసి మా ప్రజలకు ఈ విషయం చెప్పొద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ మాక్రాన్ తనను ప్రాధేయపడినట్లు ఆయనను అనుకరిస్తూ ట్రంప్ మాట్లాడారు. అమెరికా సుంకాల విషయంలో ప్రపంచ దేశాలు ఏ విధంగా భయపడుతున్నదీ కూడా ఆయన ప్రస్తావించారు. ధరలు పెంచాలన్న అమెరికా ప్రతిపాదనను ప్రాథమికంగా ప్రతి దేశం వ్యతిరేకిస్తుందని, అయితే తమ నిర్ణయం తమ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించిన మరుక్షణం అమెరికా చెప్పినట్లు వినడానికి సిద్ధపడుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.