న్యూయార్క్: గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయిల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కాల్పుల విరమణకు చెందిన షరతులను అంగీకరించేందుకు ఇజ్రాయిల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. అయితే ఆ షరతులను హమాస్ అంగీకరిస్తుందో లేదో క్లారిటీ లేదు. ఈ డీల్‌కు ఇంకా హమాస్ తన ఆమోదాన్ని తెలుపలేదని అధికారులు వెల్లడించారు.
ట్రుత్ సోషల్‌లో దీనిపై ట్రంప్ ఓ ప్రకటన చేశారు. గాజా అంశంలో తమ ప్రతినిధులు ఇజ్రాయిల్‌తో సుదీర్ఘ చర్చలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించిందని, ఆ సమయంలో అన్ని పార్టీలతో కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు. శాంతి ఒప్పందం కోసం ఖతార్, ఈజిప్ట్ తీవ్ర ప్రయత్నించాయని, వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాదన చేస్తారన్నారు. మిడిల్ఈస్ట్ మంచి కోసం హమాస్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
హమాస్‌తో పాటు ఇజ్రాయిల్‌కు 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి చెందిన డాక్యుమెంట్‌ను మంగళవారం ఖతార్ అధికారులు సమర్పించినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ నేతృత్వంలో ఇజ్రాయిల్, హమాస్ మధ్య చర్చల ప్రక్రియ సాగింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ మంత్రి రాన్ డెర్మర్.. వాషింగ్టన్ చేరుకుని అమెరికా అధికారులతో చర్చించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో ఖతార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.