వాషింగ్టన్: రెండేండ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునుకు మరో ముందడుగు పడింది. గాజా (Gaza) నుంచి బలగాలను ఉపసంహరించేందుకు ఇజ్రాయెల్ (Israel) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. హమాస్ (Hamas) కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. గాజాలో శాంతి స్థాపణకు ట్రంప్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 20 అంశాలతో కూడిన ప్రణాళికను ఇరు పక్షాల ముందు ఉంచారు. దీనికి ఇజ్రాయెల్‌తోపాటు హమాస్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే.
ప్రణాళికలో తొలిదశలో భాగంగా గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. దీనిని హమాస్‌కు కూడా పంపించామని, అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని చెప్పారు. దీంతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందని తెలిపారు. బందీల అప్పగింత తర్వాత బలగాలు ఉపసంహరణకు నిబంధనలు రూపొందిస్తామని తన ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు చేశారు.
అయితే, దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక, అమెరికా ప్రణాళికలకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య సొమవారం ఈజిప్టులో పరోక్ష చర్చలు జరగనున్నాయి. కాగా, తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తామని, అయితే గాజా నుంచి నెతన్యాహ్యూ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని హమాస్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.