వాషింగ్టన్, డిసెంబర్ 29: నిపుణులైన విదేశీ ఉద్యోగులు, కార్మికులు అమెరికా రావడానికి ఉపయోగించే హెచ్1బీ వీసా విధానానికి తానెప్పుడూ అనుకూలమేనని కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హెచ్-1బీ వీసాలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అయన మద్దతు తెలిపారు. ‘నేనెప్పుడూ హెచ్1బీ వీసాలను ఇష్టపడతాను. నేను దానికి అనుకూలమే’ అని ఆయన న్యూయార్క్ పోస్ట్‌కు తెలిపారు. వలసల విధానంపై ట్రంప్ పార్టీలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిభ ఆధారిత వలసల విధానానికి మస్క్‌తో పాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మద్దతు ఇచ్చారు. అయితే ఈ విధానం అమెరికన్ల ప్రతిభను తక్కువ చేసి చూపడమేనని పార్టీలోని కొందరు వాదిస్తున్నారు. ‘స్పేస్ ఎక్స్ టెస్లా సహా ఇతర వందలాది కంపెనీలను నిర్మించిన విశిష్టమైన వ్యక్తులతో నేను అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం హెచ్1బీ వీసా’ అని మస్క్ ఎక్స్‌లో రాశారు. పార్టీలోని కొందరు సన్నిహితులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో మస్క్‌కు ట్రంప్ తన మద్దతు తెలియజేశారు. హెచ్1బీ వీసాలపై ట్రంప్ అనుకూల వైఖరి భారతీయులకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు.