న్యూయార్క్ : యురేనియం, ఫెర్టిలైజర్స్, రసాయనాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న అంశంపై తనకు ఏమీ తెలియదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వెల్లడించారు. రష్యా నుంచి యురేనియం, ఫెర్టిలైజర్స్, కెమికల్స్‌ను అమెరికా దిగుమతి చేసుకుంటోందని భారత్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. వాటి గురించి తనకు తెలియదన్నారు. ఆ ఉత్పత్తుల గురించి చెక్ చేసుకోవాలన్నారు. ఆ అంశంపై మీకు వివరణ ఇస్తానన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఆ వ్యాఖ్యలు చేసింది.
రష్యా నుంచి భారీ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్.. దాన్ని ఎక్కువ లాభాలకు అమ్ముకంటున్నట్లు ట్రంప్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఆయనకు కౌంటర్ ఇచ్చింది. చమురు కొనుగోలు అంశంలో అనైతిక రీతిలో భారత్‌ను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నది. ట్రంప్ వైఖరిని ఖండించిన ఇండియా.. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు ఆరోపించింది. అమెరికా, ఈయూ దేశాలు.. రష్యాతో వాణిజ్య బంధాలను కొనసాగిస్తున్నట్లు ఇండియా పేర్కొన్నది.