న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ .. ఈనెల 21 నుంచి అమెరికాలో టూర్ చేయనున్నారు. అయితే ఆ సమయంలో ఆయన్ను కలవనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. మిచిగన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తిని అని ట్రంప్ కీర్తించారు. తనను కలిసేందుకు మోదీ అమెరికా వస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. కానీ ఎక్కడ, ఎప్పుడు ఎలా వాళ్ల భేటీ ఉంటుందో స్పష్టంగా తెలియదు.
సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు జరిగే క్వాడ్ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. విల్మింగ్టన్లో నాలుగోసారి ఈ శిఖరాగ్ర సదస్సు జరగనున్నది. న్యూయార్క్‌లోని భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో మోదీ ప్రసంగిస్తారు. మోదీ, ట్రంప్ చివరిసారి 2020 ఫిబ్రవరిలో కలిశారు. భారత్‌లో ట్రంప్ పర్యటించిన సమయంలో ఆ భేటీ జరిగింది.నాలుగో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం విల్మింగ్టన్లో 21న ప్రారంభమవుతుందని, దీనికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా విచ్చేస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఏడాది క్వాడ్ సమ్మిట్‌ను నిర్వహించే బాధ్యత భారత్‌దని, అయితే తామే ఈసారి దానిని నిర్వహిస్తామంటూ అమెరికా చేసిన అభ్యర్థన మేరకు ఈ సమావేశాన్ని 2025లో నిర్వహించడానికి భారత్ అంగీకరించినట్టు ఆ శాఖ ప్రతినిధి చెప్పారు.