న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మళ్లీ ఆ విషయాన్నే స్పష్టం చేశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య సంక్షోభాన్ని పరిష్కరించినట్లు చెప్పారు. లక్షల సంఖ్యలో ప్రజల జీవితాలను కాపాడారని, పాక్ సర్కారు తనను మెచ్చుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. భారత్, పాక్ మధ్య అణ్వాయుధ యుద్ధాన్ని నిలువరించామని, పాకిస్థాన్ అధినేత, గౌరవప్రదమైన జనరల్, ఫీల్డ్ మార్షల్‌తో పాటు ఆ దేశ ప్రధాని కూడా తన మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్నట్లు చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ సుమారు కోటి మంది లేదా అంత కన్నా ఎక్కువ మంది ప్రాణాలు కాపాడినట్లు పాకిస్థాన్ ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ సెక్రటరీ ఈట్ హెగ్‌సేథ్, నేవీ మంత్రి జాన్ పెలాన్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు తెలుసు కదా 8 విమానాలను కూల్చేశారని, ఆ యుద్ధం మళ్లీ ఉగ్రంగా మారే సమయంలో, ప్రెసిడెంట్ ట్రంప్ కోటి మంది ప్రాణాలను కాపాడారని అన్నారని, అన్ని యుద్ధాలను పరిష్కరించామని, కానీ ఒకే ఒక్క యుద్ధం పరిష్కరించలేదని, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తాను ఆపలేకపోయినట్లు ట్రంప్ తెలిపారు.
పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టగా, ఇండియా.. పాక్ మధ్య సంధి కుదిరినట్లు మే 10వ తేదీన ట్రంప్ ప్రకటించారు. వాషింగ్టన్లో రాత్రంతా జరిగిన చర్చల తర్వాత పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ కుదిరినట్లు ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఆ నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 60 కన్నా ఎక్కువ సార్లు ఇండియా, పాక్ యుద్ధాన్ని ఆపినట్లు ఆయన చెబుతూనే ఉన్నారు. ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చెప్పారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం మూడవ దేశ జోక్యాన్ని ఖండించింది. రెండు దేశాలు ఓ ఒప్పందం ప్రకారం సంయుక్తంగా మే 10వ తేదీన యుద్ధాన్ని ఆపేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.