టెల్ అవీవ్: గాజా యుద్ధాన్ని ముగించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించి సాధించిన కాల్పుల విరమణ నూతన పశ్చిమాసియాకు చారిత్రక శుభోదయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగిస్తూ అమెరికా ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ఇజ్రాయెల్‌కు కూడా భవిష్యత్తులో స్వర్ణయుగం తీసుకువస్తామని వాగ్దానం చేశారు. అనేక సంవత్సరాల నిర్విరామ యుద్ధం, అంతంలేని ప్రమాదం తర్వాత నేడు ఆకాశం ప్రశాంతంగా ఉంది.
తుపాకులు నిశ్శబ్దంగా ఉన్నాయి. సైరన్లు మూగబోయాయి. ఈ పవిత్ర భూమిపై సూర్యోదయం ఎట్టకేలకు శాంతంగా ఉంది. ఆ దేవుడి దయతో ఈ శాంతి కలకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఇది యుద్ధానికి ముగింపు మాత్రమే కాదు. నూతన పశ్చిమాసియాకు ఇది చారిత్రక శుభోదయం కూడా అని ట్రంప్ అన్నారు.
200% టారిఫ్‌లు విధిస్తానని బెదిరించి భారత్-పాక్ ఘర్షణను ఆపానని ట్రంప్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఈజిప్టుకు బయల్దేరుతూ విలేకర్లతో మాట్లాడారు. గాజాలో కాల్పుల విరమణ తాను పరిష్కరించిన 8వ యుద్ధ సంక్షోభంగా చెప్పుకున్నారు. పాక్-అఫ్ఘాన్ ఉద్రిక్తతలనూ పరిష్కరిస్తానన్నారు.