Donald Trump | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతా.. 22 నెలల తర్వాత తిరిగి తెరచుకుంది. ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్.. పోల్ నిర్వహించి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. ఖాతా పునరుద్ధరణపై కంపెనీ మస్క్ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. దీంతో మాజీ అధ్యక్షుడి ఖాతాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
అయితే ట్విటర్లో చేరనని గతంలోనే తేల్చిచెప్పిన ట్రంప్.. ఇపుడూ ఇదే విషయాన్ని చెప్పారు. ట్విట్టర్లోకి తిరిగి వచ్చేందుకు తనకు ఆసక్తి లేదన్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ రూపొందించిన ట్రూత్ సోషల్ యాప్ అద్భుతంగా పనిచేస్తోందని.. తాను దానికే పరిమితమవుతానని చెప్పారు. తనను తిరిగి ట్విట్టర్లోకి ఆహ్వానించినందుకు ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ట్రూత్ సోషల్ యాప్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.