వాషింగ్టన్, నవంబర్ 13: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపునకు దోహదపడ్డ వారికి డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ‘ఎఫిషియెన్సీ’ శాఖ బాధ్యతలు అప్పగించారు.
మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించే ఎఫిషియెన్సీ శాఖకు వారిద్దరూ నేతృత్వం వహిస్తారని మంగళవారం రాత్రి ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 20న కొలువుదీరనున్నది.
ఇందులో చోటుదక్కించుకున్న మొదటి భారతీయ అమెరికన్‌గా వివేక్ రామస్వామి(37) నిలుస్తారు. కేరళకు చెందిన రామస్వామి తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లిన తర్వాత, అక్కడి ఓ జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పనిచేశారు.