వాషింగ్టన్: ఇరాన్ దగ్గర ఉన్న యురేనియంను తమ దేశానికి తీసుకెళ్లనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. ఏదైనా శాంతి ఒప్పందం కుదుర్చుకుని, ఆ యురేనియంను తీసుకెళ్తామన్నారు. గత ఏడాది న్యూక్లియర్ కేంద్రాలపై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేంద్రాల్లో దాచిన యురేనియంను తీసుకెళ్లేందుకు టెహ్రాన్‌పై వత్తిడి తేనున్నట్లు ఆయన చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను కొట్టిపారేస్తున్నది. శుద్దీకరించిన యురేనియంను ఎవరికీ ఇవ్వబోమని ఆ దేశం పేర్కొన్నది. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అరిజోనాలోని ఫినిక్స్‌లో ఆ కార్యక్రమం జరిగింది. తమ వద్ద చాలా మంది తొవ్వేవాళ్లు ఉన్నారని, ఎలాగైనా ఇరాన్‌తో కలిసి ఆ యురేనియంను తీసుకెళ్తామన్నారు. త్వరలోనే అమెరికాకు ఆ యురేనియం తీసుకెళ్తామని చెప్పారు. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందంలో డబ్బులు చేతులు మారే అవకాశం లేదని ట్రంప్ తెలిపారు.
మరోవైపు పశ్చిమాసియా సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎంటర్ అయ్యింది. అమెరికా వద్ద ఉన్న అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఇది. ఇటీవల వరకు ఈస్ట్రన్ మెడిటరేనియన్ ప్రాంతంలో ఆపరేషన్‌లో ఉన్న ఫోర్డ్ యుద్దనౌక ఇప్పుడు ఎర్రసముద్రంలోకి వచ్చేసింది. దీనితో పాటు యూఎస్ఎస్ మహన్, యూఎస్ఎస్ విన్స్టన్ చర్చిల్ యుద్ధనౌకలు కూడా ఉన్నాయి. ఫోర్డ్ యుద్ధనౌకలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగింది. దీంతో దాన్ని రిపేర్ చేసేందుకు వెనక్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌక ఆరేబియా సముద్రంలో పహారా కాస్తున్నది. ఇక దక్షిణాఫ్రికా తీరంలో యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ నౌక కూడా రెఢీగా ఉన్నది.