Donald Trump : 77వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న ఇండియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘77వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న ఇండియా ప్రజలకు, ప్రభుత్వానికి అమెరికా ప్రజల తరఫున, నా తరఫున శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, ఇండియా చారిత్రక బంధాన్ని కలిగి ఉన్నాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇండియాపై టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు అమెరికా సెక్రెటరీ మార్కో రుబియో కూడా ఇండియాకు ప్రత్యేక విషెస్ చెప్పారు. ‘‘రక్షణ, ఎనర్జీ, ఖనిజాలు, టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎంతో ప్రగతి దోహదం పడుతోంది. ఈ సంవత్సరం కూడా మరిన్ని భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని రుబియో అన్నారు. ఇక.. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఇండియాలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ హాజరయ్యారు.
అమెరికా తయారు చేసిన విమానం ఇండియాలో ఎగరడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇది ఇరుదేశాల బలమైన సంబంధాలకు నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికా, ఇండియా మధ్య ఇంకా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరాల్సి ఉంది.