ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగాయి. సీజ్ఫైర్ తర్వాత కూడా 20 క్షిపణులతో ఇరాన్ తమపై దాడి చేసిందని ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ చమురుకేంద్రాలే లక్ష్యంగా క్షిపణి దాడులకు దిగింది. దాడి అనంతరం మంగళవారం సాయంత్రం టెహ్రాన్‌లోని ఓ ఆయిల్ డిపో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఉల్లంఘన జరిగినప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నదని, దానికి కట్టుబడి ఉండాలని అగ్రరాజ్యాధినేత ఇరుదేశాలను హెచ్చరించారు.
దుబాయ్, జూన్ 24: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, కొద్ది గంటలకే రెండు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో సీజ్‌ఫైర్‌పై సందిగ్ధం నెలకొన్నది. ఈ క్రమంలో ఇరు దేశాలపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాడులకు దిగరాదని రెండు దేశాలను హెచ్చరించారు. తొలుత ఉల్లంఘించినా, ఒప్పందం అమలులోనే ఉందని తెలిపారు.
తొలుత కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉందని ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ తమ గగనతలం వైపు 20 క్షిపణులతో దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ తప్పుబట్టింది. ఈ దాడిలో నలుగురు పౌరులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని తెలిపింది. అయితే తాము ఇరాన్‌పై దాడులు చేశామన్న ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఒప్పందం అమలుకు గంట ముందు వరకు ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తూనే ఉందని ఆరోపించింది. అనంతరం హేగ్‌లో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతూ ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడి దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇరు దేశాలు ఈ కొత్త ఒప్పందాన్ని తొలుత ఉల్లంఘించినట్టు తాను భావిస్తున్నాన్నారు. అయితే ఇరాన్ పొరపాటున దాడికి దిగి ఉండవచ్చునని పేర్కొంటూ తన మిత్ర ఇజ్రాయెల్ దేశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత దాని చర్యను కూడా సమర్థిస్తూ ఇజ్రాయెల్ ఇక దాడి చేయబోవడం లేదని ప్రకటించారు.
తన మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఇరు దేశాలు దానిని ఉల్లంఘించడమేమిటని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకేం చెప్పారు? మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఒక దశలో సహనాన్ని కోల్పోయిన ఆయన అభ్యంతరకర పదజాలాన్ని కూడా వాడారు. ఆ తర్వాత సర్దుకుని ఇరు దేశాలు కాల్పుల విరమణకు వచ్చినట్టు ప్రకటించారు. భవిష్యత్‌లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోరని, ఇజ్రాయెల్ విమానాలు తిరిగి సొంత గడ్డకు చేరుకుంటాయని అన్నారు. తక్షణమే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని మరోసారి ప్రకటించారు.
ఇరాన్ దాడిపై ఆగ్రహంతో ప్రతి దాడికి వెళ్తున్న ఇజ్రాయెల్‌ను తాను ఆపినట్టు ట్రంప్ చెప్పారు. ‘ఆ బాంబులను వేయొద్దు. అదే కనుక చేస్తే కాల్పుల విరమణలో భారీ ఉల్లంఘనకు పాల్పడినట్టే. వెంటనే మీ పైలట్లను వెనక్కి పిలవండి‘ అని తాను ఆదేశించానన్నారు. యుద్ధం కొనసాగితే జరిగే తీవ్ర పరిణామాలు ఇరు దేశాలకు అర్థం కావడం లేదని అన్నారు. ‘అన్ని విమానాలు ఇంటికి బయలుదేరి ఇరాన్‌కు స్నేహపూర్వ ప్లేన్ వేవ్ చేస్తాయి. ఎవరూ గాయపడకూడదు. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది’ అని ట్రూత్‌లో పేర్కొన్నారు. నిజానికి తాము ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత ఇరాన్‌పై కఠినమైన దాడిని నిలిపివేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ సమన్వయంతో ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో ఖతార్ కీలక పాత్ర పోషించింది.