వాషింగ్టన్, జనవరి 13: ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు జరిపే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాల విధింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. అయితే ఇరాన్‌తో వ్యాపారం అంటే ఏమిటో ఆయన నిర్వచించ లేదు. ట్రంప్ తాజా ప్రకటన ప్రభావం భారత్‌పై కూడా పడనుంది. ఎందుకంటే ఇరాన్ అతిపెద్ద ఐదు వాణిజ్య భాగస్వామి దేశాల్లో భారత్ కూడా ఉంది.
ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న 50 శాతం టారిఫ్‌లకు అదనంగా మరో 25 శాతం కలిపి 75 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అదనపు సుంకాలు ఎలా విధిస్తారో ఇంకా స్పష్టత లేదు. ట్రంప్ ప్రకటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ అదనపు సుంకాలు ఎలా పనిచేస్తాయి, ఏయే దేశాలను లక్ష్యంగా చేసుకుంటారు, వస్తువులే కాకుండా సేవలపై కూడా ఈ అదనపు సంకాలు విధిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇరాన్లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను చంపడం ఆపకపోతే అమెరికా సైనిక చర్య తీసుకుంటుందని ట్రంప్ ఇటీవల ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్‌తో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. తర్వాతి స్థానాల్లో ఇరాక్, యూఏఈ, తుర్కియే, భారత్ ఉన్నాయి.