Donald Trump : ఫ్రాన్స్ (France) లో జరుగుతున్న భారీ విద్యార్థి ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనలకు అదుపుతప్పిన వలసలే కారణమని, దేశాన్ని (ఫ్రాన్స్) ఇస్లాం తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నమే ఇదని ఆరోపించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్ (Truth Social)’ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఫ్రాన్స్‌లో జరుగుతున్నది అదుపులేని సామూహిక వలసల ఫలితమే తప్ప మరొకటి కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నిరసనలు పాఠశాలల గురించి కాదని అన్నారు. ఒకప్పుడు గొప్ప దేశంగా ఉన్న ఫ్రాన్స్‌ను ఇస్లాం స్వాధీనం చేసుకోవాలనుకుంటోందని పేర్కొన్నారు. అయితే ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనలకు, ట్రంప్ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతున్నది. విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలు, నిధుల కొరత, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై ఆందోళనలు జరుగుతున్నాయి.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గత సెప్టెంబర్ నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనల డిమాండ్లలో వలసలు లేదా మతపరమైన అంశాలు ఎక్కడా లేవు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఘాటుగా స్పందించారు. మన కథను మనమే రాసుకోకపోతే, ఇతరులు మన కోసం రాస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ఇతరులు తమకు అనుకూలంగా అన్వయించుకోవడానికి అనుమతించవద్దని ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను హెచ్చరించారు.
నిన్న జరిగిన నిరసనల్లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది పాల్గొన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పగా.. 4.5 లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 6,100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.