Aggipetti Macha | సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ ఒకరు. తనదైన కామెడీ, ప్రత్యేకమైన మాటతీరు, హావభావాలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. కిరణ్ చేసే రీల్స్, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించేది. అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కిరణ్ పెద్దగా కనిపించడం లేదు. రీల్స్, వీడియోలు చేయకపోవడంతో ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ ఏమయ్యారు? అంటూ అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్త వెలుగులోకి వచ్చింది.
సమాచారం ప్రకారం.. తీవ్ర అనారోగ్యంతో అక్టోబర్ 5న కిరణ్ తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కిరణ్‌కు అసలు ఏ అనారోగ్య సమస్య తలెత్తింది? ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అనే విషయాలపై అధికారికంగా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. తిరుపతికి చెందిన కిరణ్.. ‘అగ్గిపెట్టె మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఆయన మాట్లాడే విధానం, ప్రత్యేకమైన డైలాగులు, హావభావాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో కొద్దికాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
కిరణ్ క్రేజ్ ఎంతగా పెరిగిందంటే.. పలువురు యూట్యూబర్లు ఆయనను ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేసేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు, ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టీవీ కార్యక్రమాల్లోనూ ఆయన సందడి చేశారు. సోషల్ మీడియా సెన్సేషన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్నటి వరకు తన వీడియోలు, రీల్స్‌తో అందరినీ నవ్వించిన కిరణ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త అభిమానులను కలచివేస్తోంది. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని, కోలుకుని మళ్లీ తన వీడియోలతో ప్రేక్షకులను నవ్వించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం కిరణ్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అధికారికంగా సమాచారం వెల్లడైన తర్వాతే ఆయన పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.