Rahul Gandhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు నేతలు మంగళవారం ఢిల్లీలో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరంతా ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద నిరసన చేపట్టారు. అయితే, అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్లోకి ప్రవేశించారనే ఆరోపణతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న ఇతర ప్రతిపక్ష ఎంపీలు, కార్యకర్తలపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సర్కు, జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ ఎంపీలు ఆకాశవాణి భవన్ వద్ద ఆందోళన చేశారు. దాదాపు ఎనిమిది గంటలకుపైగా.. 260 మంది వరకు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం మంగళవారం రాత్రి వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వోట్ చోరీకి పాల్పడిందని ఆరోపిస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చారు.
దీనిలో భాగంగా పార్లమెంట్ భవనం నుంచి ఈసీఐ ప్రధాన కార్యాలయం వరకు పలువురు నేతలు ర్యాలీ చేపట్టారు. కానీ, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నేతలు ఆకాశవాణి భవన్ వద్ద నిరసనకు దిగారు. అయితే, వారి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వారిపై కేసు నమోదు చేశారు.