Russia vs Ukraine : రష్యా, ఉక్రెయిన్ (Russia, Ukraine) దేశాల మధ్య దాదాపు ఐదేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా నల్లసముద్రం (Black Sea) లో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. రష్యా రిసార్ట్ నగరమైన సోచి సమీపంలో లైబీరియా జెండా (Liberia flag) తో వెళ్తున్న ఓ భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. దాంతో ట్యాంకర్లో భారీగా మంటలు చెలరేగాయి. దాడి సమయంలో ట్యాంకర్లో ఉన్న సిబ్బంది మొత్తం భారతీయులే కావడం గమనార్హం.
దాడి జరిగినప్పుడు ఆయిల్ ట్యాంకర్లో ఉన్న 23 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు రష్యా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది భారత అధికారులకు కొంత ఊరట కలిగించే విషయమని తెలిపింది. ‘నేవల్ డ్రోన్ల’ ద్వారా ఈ దాడి జరిగిందని అధికారులు చెప్పారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేయలేకపోతున్నారని అన్నారు. ట్యాంకర్ నుంచి ముడిచమురు సముద్రంలోకి వ్యాపించి మండుతోందని, మంటలు కొంచెం తగ్గిన తర్వాత మళ్లీ ఆర్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
ఆయిల్ ట్యాంకర్లో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోచి నగరం సమీపంలో సముద్రంపై భారీగా నల్లటి పొగ, నారింజ రంగు మంటలు ఎగిసిపడుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తున్నది. దాంతో సోచి నగర మేయర్ ముందుజాగ్రత్త చర్యగా తీర ప్రాంతానికి, బీచ్‌లకు ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే నల్లసముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు.
2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాలు వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్నాయి. కాగా రొమేనియా తీరంలో ఓ నౌక మునిగిపోయి ఒకరు మృతి చెందిన ఘటన జరిగిన మరుసటిరోజే ఉక్రెయిన్ ఈ డ్రోన్ దాడికి పాల్పడటం గమనార్హం. ఈ దాడి రష్యానే చేసిందని, అందులోనూ ఒక భారతీయ సిబ్బంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు రష్యా కూడా ఇటీవల ఉక్రెయిన్ ధాన్యాన్ని తరలిస్తున్న నౌకలపై దాడులు చేస్తున్నది.
తమ నగరాలపై రష్యా చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే రష్యా చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఉక్రెయిన్ వాదిస్తున్నది. ఇటీవలి వారాల్లో దాడులను తీవ్రతరం చేస్తామని ఇరుపక్షాలు ప్రకటించాయి. గతంలో రష్యాలోని చమురు కేంద్రాలపై జరిగిన ఉక్రెయిన్ దాడులవల్ల సముద్రంలో ఆయిల్ స్లిక్లు ఏర్పడటం, బీచ్‌లను మూసివేయడం, ఆకాశం నుంచి విషపూరిత నల్లటి వర్షం కురవడం వంటి పర్యావరణ నష్టాలు సంభవించాయి. ఇప్పటి ఈ ఘటనతో మరోసారి అలాంటి ముప్పు పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.