న్యూఢిల్లీ, మార్చి 10: అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్టులో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైంది. శీతాకాలం సెలవుల సందర్భంగా తన స్నేహితురాళ్లతో కలసి విహార యాత్ర నిమిత్తం డొమినికన్ రిపబ్లిక్ వెళ్లిన సుదీక్ష పంటా కానాలోని రియూ రిపబ్లికా హోటల్‌కు చెందిన బీచ్ వద్ద మార్చి 6న చివరిసారి కనిపించింది.
బీచ్ వద్ద ఉన్న సుదీక్ష పెద్ద అల వచ్చి సముద్రంలో గల్లంతై ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అదృశ్యం కావడానికి ముందు సుదీక్ష మరో ఆరుగురు స్నేహితులతో కలసి బీచ్ వద్ద ఉన్నారని వారు చెప్పారు. అయితే మిగిలిన వారంతా రిసార్ట్‌కు తిరిగిరాగా సుదీక్ష, మరో అపరిచిత వ్యక్తి అక్కడే ఉండిపోయారని తెలిపారు.